అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేత కేటీ రామారావు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్ సంభాషణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్ చేసి జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంపై అభినందన తెలిపిన విషయం తెలిసిందే.

బిజెపి, వైఎస్సార్ కాంగ్రెసు, టీఆర్ఎస్, జనసేన తీరును చంద్రబాబు తప్పు పట్టారు. ఆ నాలుగు పార్టీలు కూడా తమ తెలుగుదేశం పార్టీనే లక్ష్యం చేసుకున్నాయని ఆయన విమర్శించారు. 

తిత్లీ తుఫాన్ తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ కనీసం సానుభూతి కూడదా ప్రకటించలేదని ఆయన అన్నారు. వాళ్లంతా కలిసి పని చేస్తున్నారని చెప్పడానికి ఇంత కన్నా రుజువులు ఏం కావాలని చంద్రబాబు అడిగారు. 

పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. తుఫాన్ నష్టం చూసేందుకు కేంద్రం నుంచి ఒక్క బీజేపీ నేత కూడా రాకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. కేంద్రం తక్షణ సాయం కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను బాధితుల్ని పరామర్శిస్తుంటే వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతున్నారని అన్నారు. పవన్‌కల్యాణ్ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
 
జగన్ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అతని ఫ్యాక్షన్ మనస్తత్వామే దీనికి కారణమని అన్నారు. జగన్ చిత్తుశుద్ధితో పాదయాత్ర చేయడం లేదని, అదో డ్రామా అని ఆయన అన్నారు. జగన్ ఇదే విధంగా మరో నాలుగేళ్లు నడిచినా అతనికి ఫలితం దక్కదని అన్నారు. దేనికైనా విజన్, ఎగ్జిక్యూషన్ ఉంటేనే ఫలితాలు వస్తాయని అన్నారు.
 
నాలుగు పార్టీలు కలిసి పని చేయడం తమకే లాభిస్తుందని అన్నారు. వాళ్లు తిట్టే తిట్లే మనకు ప్రజా దీవెనలని అన్నారు. తిత్లీ బాధితులకు ప్రభుత్వం చేసిన సాయాన్ని ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారని గుర్తుచేశారు. తమకు ఉన్న ప్రజాభిమానాన్ని సహించలేకనే ప్రతిపక్షాలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని అన్నారు. 

సంబంధిత వార్త

పవన్ కల్యాణ్ కు కేటీఆర్ ఫోన్: చంద్రబాబుపై కోపంతోనే...