Asianet News TeluguAsianet News Telugu

చిరు పార్టీ పెట్టకుంటే మేం గెలిచేవాళ్లం, అనవసరంగా లాగుతున్నారు: చంద్రబాబు

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న వివాదంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ వివాదంలోకి టీడీపీని లాగుతున్నారని ఆయన అన్నారు. సినీ పరిశ్రమ టీడీపీకి సహకరించలేదని చంద్రబాబు చెప్పారు.

Chandrababu reacts on cinema tickets controversy, comments on chiranjeevi
Author
Mangalagiri, First Published Jan 11, 2022, 5:58 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సినిమా టికెట్ల వివాదంలోకి తమ పార్టీని లాగుతున్నారని ఆయన అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఏ రోజు కూడా టీడీపీకి సహకరించలేదని ఆయయ స్పష్టం చేశారు. తాను సిఎంగా ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమాలు కూడా తీశారని ఆయన అన్నారు. చైతన్యరథం పేర టీడీపీ పెట్టిన ఈ - పేపరును ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా Chandrababu మాట్లాడారు.

మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టకుంటే తాము 2009 ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్లమని చంద్రబాబు అన్నారు. పార్టీ పెట్టక ముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని చెప్పారు. Chiranjeevi ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా చిరంజీవి బాగానే ఉన్నారని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో పోరాటం అనేది ఆటలో భాగమని ఆయన అన్నారు. చట్ట సవరణల ద్వారా రాజకీయ అవినీతిని అడ్డుకోవాలని, కేంద్రం కూడా ఇటువంటి అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. 

కొంత మంది అవినీతి డబ్బుతో పేపర్, టీవీ చానెల్ పెట్టినా TDP ఎప్పుడు కూడా సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేయలేదని చందరబాబు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్థాపించిన సాక్షి మీడియాను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే ఆయనధుంగా చైతన్యరథం పనిచేస్తుందని ఆయన చెప్పారు. స్వతంత్రంగా పనిచేసే మీడియా మీద వైసీపీ ప్రభుత్వం వేటు వేసిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నియంత్రణలో లేకుంటే తప్పు కేసులతో బెదిరిస్తున్నారని చంద్రబాబు అన్నారు. 

వీళ్లు పుట్టక ముందు నుంచి ఉన్న మీడియా సంస్థలకు కూడా కులముద్ర వేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. 60 శాతం మంది ప్రజలు సోషల్ మీడియాలకు అలవాటు పడ్డారని ఆయన చెప్పారు. సొంతూరు విశేషాలు రియల్ టైమ్ లో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నట్లు తెలిపారు. టీడీపీకి ఉన్న 70 లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసే విధంగా చైతన్య రథం ఈ - పేపర్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ఒక్క క్లిక్ తో 30 లక్షల మంది పార్టీ శ్రేణులకు ఈ - పేపర్ ను పంపించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే పలు సోషల్ మీడియా వేదికల ద్వారా పార్టీ సమాచారాన్ని చేరవస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉందని ఆయన చెప్పారు. 

కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాను కూడా పెట్టుకున్నారని, కానీ టీడీపీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ 20 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా పేపర్ పెట్టాలని, టీవీ పెట్టాలనే ఆలోచన చేయలేదని చెపపారు. మీడియా వాళ్లు వాళ్ల పని వాళ్లు చేసుకుంటారనే ఉద్దేశమే దానికి కారణమని చెప్పారు. మీడియా వాళ్లు వాళ్ల పని వాళ్లు చేస్తారని, రాజకీయాల్లో తమ పని తాము చేయాలని అన్నారు. మనం చేసే పని ప్రజాహితం కోరిందైతే పేపర్లలో ఏది రాయాలో అదే రాస్తారని ఇప్పటి వరకు తాము ముందుకు వెళ్లినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ తరం పెద్ద యెత్తున సోషల్ మీడియాకు అలవాటు పడిందని చెప్పారు. ప్రపంచంలో ఏం జరిగిందనే దాని కన్నా తన గ్రామంలో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకుంటే సంతృప్తిగా ఉంటుందని, అందుకే చైతన్యరథం తెచ్చామని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios