కరోనా మందు పంపిణీ జరుగుతోందని ఎమ్మెల్యే కాకాని ప్రకటనతోనే ప్రజలు వేలాదిగా కృష్ణపట్నంకు తరలివచ్చారని... దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని చంద్రబాబు అన్నారు.
అమరావతి: ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యను అదుపులోకి తీసుకోవడం సరికాదని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి చర్యల వల్లే కృష్ణపట్నంలో తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. కరోనా మందు పంపిణీ జరుగుతోందని ఎమ్మెల్యే కాకాని ప్రకటనతోనే ప్రజలు వేలాదిగా కృష్ణపట్నంకు తరలివచ్చారని... దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని చంద్రబాబు అన్నారు.
''భారీగా తరలివచ్చిన ప్రజలు మందుకోసం క్యూలైన్లలో నిలబడ్డారు. ఇక్కడ కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?'' అని చంద్రబాబు నిలదీశారు.
''కరోనా వ్యాప్తికి కారణమైన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు పెట్టాలి. అలాగే ఆనందయ్య అందిస్తున్న కరోనా మందుపై కేంద్ర ఆయుష్, ఐసీఎంఆర్ త్వరగా అధ్యయనం చేయాలి'' అని చంద్రబాబు నాయుడు సూచించారు.
read more డాక్టర్ సుధాకర్ ను జగన్ ప్రభుత్వం బలి తీసుకుంది: చంద్రబాబు
ఇప్పటికే ఆయుర్వేద వైద్యుడు బొగని ఆనందయ్య కరోనా మందు పంపిణీ వారం పాటు నిలిపివేశారు. దీనికి కారణం ఆనందయ్య వివరించారు. ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి భరోసాతోనే శుక్రవారం కరోనా ఆయుర్వేద మందు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు.
అయితే తయారు చేసిన మందు అయిపోవడంతో పంపిణీ నిలిపివేశామని ఆనందయ్య చెప్పారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, పదార్థాలు సేకరించడానికి రెండు, మూడు రోజుల సమయం పడుతుందని అన్నారు. ఈ లోపు ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
