అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల నుంచి గట్టెక్కించడంలో సిద్ధహస్తుడిగా విజయసాయిరెడ్డిని చెప్పుకుంటారు. విజయసాయిరెడ్డి ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు పార్లమెంట్ సమావేశాల్లో తప్ప. 

ఇకపోతే ఆయన ఎప్పుడు, ఎవరిని కలుస్తున్నారో అనేది తెలుసుకోవడం చాలా కష్టం అని ఆ పార్టీలో చెప్పుకుంటుంటారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు అన్న విషయాను పసిగట్టేందుకు ప్రయత్నించి చాలా మంది బొక్క బోర్లా పడ్డారట. 

అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొత్తగా విజయసాయిరెడ్డిపై ఫోకస్ పెట్టారంట. విజయసాయిరెడ్డికి సంబంధించి పర్యటన వివరాలు రాబట్టే పనిలో పడ్డారట. మినిట్ మినిట్ విజయసాయిరెడ్డిని అబ్జర్వేషన్ చేసేందుకు ఒక టీంను కూడా ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతుంది. 

విజయాసాయిరెడ్డి ఎక్కడికి వెళ్తే చంద్రబాబు నాయుడుకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా...ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీలో అలజడి సృష్టించేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారని చంద్రబాబుకు సమాచారం అందిందట. 

తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులను కీలక నేతలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారట. వారితో రహస్యంగా చర్చలు కూడా జరిపి ఆ తర్వాత పార్టీలో చేర్చుకుంటున్నారట. 

మేడా మల్లిఖార్జునరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్, తాజాగా అవంతి శ్రీనివాస్ ఇలా వరుసగా వీరందర్నీ టచ్ లోకి తెచ్చింది విజయసాయిరెడ్డేనని ప్రచారం జరుగుతుంది. వీరితోపాటు తెలుగుదేశం పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎంపీ, ఉత్తరాంధ్ర నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యేను వైసీపీలోకి ఆహ్వానించారట. 

ఇప్పటికే విజయసాయిరెడ్డి వారితో చర్చలు కూడా జరిపారని వారంతా త్వరలోనే వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. అంతేకాదు విజయాసాయిరెడ్డి దగ్గర వైసీపీలో చేరే ఎమ్మెల్యేల లిస్ట్ కూడా ఉందని ప్రచారం జరుగుతుంది. దీంతో చంద్రబాబు నాయు విజయసాయిరెడ్డిపై ఫోకస్ పెట్టారట. 

ఇలా వదిలేస్తే టీడీపీ కొంప ముంచుతారని గ్రహించిన చంద్రబాబు ఇకపై అలా జరగకుండా ఉండేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. ఇంటి దొంగలను ఈశ్వరుడు అయినా పట్టలేరన్నట్లు పార్టీలో అసంతృప్తులు ఉన్నా పైకి కనబడరని కానీ విజయసాయిరెడ్డితో భేటీ అయ్యేవాళ్లే అసంతృప్తులు అన్న విషయం అయినా తెలిసి వారిని తన దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.