అమరావతి: మాజీ మంత్రి భూమా అఖిలప్రియను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అఖిల ప్రియ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లుగా మిగిలిన నియోజకవర్గాల్లో కూడా యువ నాయకత్వం స్థానిక సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడులూ దౌర్జన్యాలపై పోరాటం చేస్తున్నామని, హత్యలూ భౌతిక దాడులూ ఆస్తుల ధ్వంసం వంటి అరాచకాలపై జాతీయ స్థాయిలో పోరాటం చేశామని, చాలా ఏళ్ల తర్వాత మానవ హక్కుల బృందం రాష్ట్రంలో పర్యటించిందని ఆయన చెప్పారు. 

గత పాలనా కాలంలో తాము రాష్ట్రాభివృద్ధిపై, సంక్షేమంపై దృష్టి పెట్టామే తప్ప ఓట్లు రాబట్టుకోవడంపై శ్రద్ధ పెట్టలేదని, ఓట్లు రాబట్టడంపై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఫలితాలు వేరే విధంగా ఉండేవని చంద్రబాబు అన్నారు. ఇన్ని కష్టాల్లోనూ కార్యకర్తల్లో పార్టీ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమవుతోందని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలు యువనేతలు అండగా ఉండాలని ఆయన అన్నారు. 

బుధవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. 1982లో పార్టీ ఆవిర్భవించినప్పుడు చేరిన 18-25 ఏళ్ల యువతరం ఇప్పుడు 55-70 ఏళ్లకు చేరిందని, మూడోతతరం ముందుకు రావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. వచ్చే మూడేళ్లలో యువ నాయకత్వం సిద్ధం కావాలని ఆయన అన్నారు. 

పార్టీ పదవుల్లో 33 శాతం యువతకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సంస్థాగత ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేస్తామని చెప్పారు. 35 ఏళ్ల లోపు వారికి పార్టీలో 33 శాతం పదవులు ఇస్తామని చెప్పారు. సీనియర్ల అనుభవం, యువకుల ఉత్సాహం పార్టీ పురోగతికి తోడ్పడాలని ఆయన అన్నారు.