Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పొలిటికల్‌ జర్నీ.. ఎన్ని మలుపులో...

అప్పుడే ఎన్టీఆర్‌తోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. అనంతరం ఎన్టీఆర్ చిన్న కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహమైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా.. చంద్రబాబు వెంటనే అందులో చేరలేదు. కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 

Chandrababu Political Journey highlights
Author
First Published Jun 4, 2024, 9:56 PM IST

నాలుగో సారి ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబు రాజకీయ ప్రయాణం అంతా ఆసక్తికరమే. విద్యార్థిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఉద్ధండులతో కలిసి రాజకీయాలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లు దాటారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన జరిగాక ఒకసారి కలిపి మొత్తం మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన చరిత్ర ఆయనది. నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన లేని రాజకీయాలు లేవు. 

చంద్రబాబు నాయుడు తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లోనే రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. అప్పటి ఎమ్మెల్సీ రాజగోపాల్ నాయుడి ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగుపెట్టాడు. ఎన్‌జీ రంగా అనుచరుడిగా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో తొలిసారి చంద్రబాబు శాసనసభకు పోటీ చేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికలలో ఇందిర కాంగ్రెస్ తరఫున చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. గాంధేయవాదిగా పేరున్న పట్టాభిరామ చౌదరిపై 2వేల 494 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు 35వేల 92 ఓట్లు రాగా... పట్టాభిరామ చౌదరికి 32వేల 598 ఓట్లతో ఓటమి పాలయ్యారు. అలా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు... కొద్దికాలంలోనే టంగుటూరి అంజయ్య కేబినెట్‌లో మంత్రి అయ్యారు. సాంకేతిక విద్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ, మైనర్‌ ఇరిగేషన్‌తో పాటు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో సినిమా వాళ్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పుడే ఎన్టీఆర్‌తోనూ సాన్నిహిత్యం ఏర్పడింది. అనంతరం ఎన్టీఆర్ చిన్న కుమార్తె భువనేశ్వరితో చంద్రబాబుకు వివాహమైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా.. చంద్రబాబు వెంటనే అందులో చేరలేదు. కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 

తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీ చేసినప్పుడు 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేశారు. టీడీఈ అభ్యర్థి మేడసాని వెంకట రామనాయుడి చేతిలో పరాభవం ఎదుర్కొన్నారు. ఈ ఓటమి తర్వాత చంద్రబాబు టీడీపీలో చేరారు. తెలుగుదేశంలో చంద్రబాబు పనితీరు ఎన్టీఆర్‌ను మెప్పించింది. నాదెండ్ల భాస్కరరావు తిరుగుబావుటా ఎగురవేసిన సమయంలో బాబు వేసిన పైఎత్తులు, అనుసరించిన రాజకీయ వ్యూహాలు ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ భారీ ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినా 1984లో అనూహ్యంగా అధికారం కోల్పోయారు. 

1984లో ఎన్టీఆర్ వైద్యం కోసం అమెరికా వెళ్లినప్పుడు నాదెండ్ల భాస్కరరావు కొందరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో నాదెండ్ల తన క్యాంపులోని ఎమ్మెల్యేలతో గవర్నర్‌ను కలిసి సీఎం అయ్యారు. ఈ క్రమంలో అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నెల రోజుల సమయమివ్వగా.. చంద్రబాబు అన్నీతానై చక్రం తిప్పాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను వెంట పెట్టుకెళ్లి రాష్ట్రపతిని కలిసి ఎన్‌టీఆర్‌కు మద్దతు ప్రకటించారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలను ఎన్‌టీఆర్‌కు మద్దతుగాచంద్రబాబు కూడగట్టడంతో బల నిరూపణకు ముందే నాదెండ్ల రాజీనామా చేశారు. ఆ తర్వాతే చంద్రబాబుకు ఎన్టీఆర్ మరింత ప్రాధాన్యమిచ్చారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకుండా టీడీపీ కోసం పనిచేశారు. 1989లో చంద్రగిరి నియోజకవర్గాన్ని వీడి కుప్పం బరిలో నిలిచి విజయం అందుకున్నారు. అయితే, టీడీపీ ఓడిపోవడంతో ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీకి వెళ్లడానికి ఎన్టీఆర్ ససేమిరా అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత1994 ఎన్నికల్లో టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి జోక్యం పెరుగుతోందన్న ఆరోపణలతో చంద్రబాబు, ఎన్టీఆర్ కుమారులు కొందరు తిరుగుబాటు చేశారు. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్‌పై అవిశ్వాసం ప్రకటించి... ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పరిణామాన్ని ఉద్దేశించే వెన్నుపోటు అంటూ చంద్రబాబును ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. 

ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన మార్క్ పాలన సాగించారు. స్మార్ట్ గవర్నెన్స్, ఐటీ, ప్రజల వద్దకే పాలన, జన్మభూమిలాంటి కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఉమ్మడి రాష్ట్రానికి అధునాతన సాగు విధానాలు పరిచయడం చేశారు. 1998లో హైటెక్ సిటీని ప్రారంభించి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగం అభివృద్ధికి కృషి చేశారు. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుని.. ఉత్తమ సీఎంగా రికార్డుకెక్కారు. 
అలా నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. 1999లో సొంతంగా ఎన్నికల బరిలోకి దిగారు. బీజేపీ మద్దతుతో 178 స్థానాలను ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ అందుకోగా.. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

రెండో విడత పాలనలో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచడం, రాష్ట్రంలో వర్షాభావం, కరవు పరిస్థితులతో ప్రజల్లో క్రమేణా వ్యతిరేకత పెరిగింది. 2000లో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వామపక్షాలు, రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం ప్రజాగ్రహానికి కారణమైంది. ఇక, టెలీ కాన్ఫరెన్సులు, ప్రజల వద్దకే పాలన లాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి పెరగడంతో మరింత వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదేళ్లు పాలన సాగించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు సాధించగా.. 23 స్థానాలకే తెలుగుదేశం పరిమితమైంది. ఇక తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీతో కలిసి టీడీపీ భారీ విజయం సాధించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios