అమరావతి: నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఇంటిలో చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారని అధికార వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో  ఆ ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు నివాసం కోసం పలు గెస్ట్‌హౌస్ ల కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు.

అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు  స్వీకరించిన తర్వాత ఉండవల్లిలోని లింగమనేని  రమేష్ ఇంట్లో చంద్రబాబు  ఉంటున్నాడు.  ఈ ఇల్లు కూడ  నిబంధనలకు విరుద్దంగా ఈ ఇల్లు నిర్మించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ ఇంటి పక్కనే నిబంధనలకు విరుద్దంగా  నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేశారు.

నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన ఇంట్లోనే చంద్రబాబు నివాసం ఉంటున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ కలెక్టర్ల సమావేశంలోనే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలపై చంద్రబాబు బుధవారం నాడు పార్టీ నేతలతో చర్చించారు. 

 ఉండవల్లిలో ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని  ఖాళీ చేయాలని మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు.   చంద్రబాబు నివాసం  ఉండేందుకు పలు గెస్ట్‌హౌజ్‌లను టీడీపీ నేతలు  పరిశీలించారు.

క్వాలిటీ ఐస్‌క్రీమ్, గ్రావెల్ ఇండియా, నోవాటెల్ హోటల్‌కు సమీపంలోని గెస్ట్‌హౌస్‌‌లను టీడీపీ నేతలు పరిశీలించారు.  వీటితో పాటు మరికొన్ని ఇళ్లను కూడ ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.

ఉండవల్లిలోని లింగమనేని రమేష్ భవనం కూడ నిబంధనలకు విరుద్దంగా  నిర్మించారని  ప్రభుత్వ సంస్థల నుండి నోటీసులు ఉన్నాయి.ఈ విషయమై రమేష్ కోర్టును కూడ ఆశ్రయించారు. 

ప్రజా వేదికను కూల్చివేసిన తర్వాత చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై కూడ ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో ఈ ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటిని చూసుకోవాలని  బాబు భావిస్తున్నారు.