విజ‌య‌వాడ‌: ప్రముఖ పాత్రికేయులు, సీనియర్ జర్నలిస్ట్, మార్కిస్టు మేధావి, భారత కమ్యునిష్టు నాయకులు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి భౌతిక‌కాయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన భౌతిక కాయాన్ని చుట్టుగుంట విశాలాంధ్ర కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. 

చుట్టుగుంట విశాలాంధ్ర కార్యాలయంలో చంద్రబాబు రాఘవాచారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), పార్టీ నేత‌లు బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌దిత‌రులు ఆయన వెంట ఉన్నారు.

విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిశారు. రాఘవాచారి 1972 నుంచి విశాలాంధ్ర ఎడిటర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. విశాలాంధ్ర ఎడిటర్‌గా మూడు దశాబ్దాలు నిర్విఘ్నంగా కొనసాగారు. 

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమానికి ఆయన అందించిన సేవలు ఎనలేనివి.సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగా సేవలందించారు.రాఘవాచారి పాలకుర్తి మండలం శాతపురం కు చెందినవారు. ఆయన పూర్వీకులు తమిళనాడు నుంచి ఇక్కడకు వచ్చారు.