కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కనమలదొడ్డిలో పవన్ కళ్యాణ్ కటౌట్ కడుతూ విద్యుత్ షాక్ గురై ముగ్గురు మృతి చెందగా 5గురి పరిస్థితి విషమంగా ఉన్న దురదృష్టకర సంఘటన తెలిసిందే.  

ఫ్లెక్సీ కడుతూ పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై స్థానిక శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని,  విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను, బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని,  ఆర్ధిక సాయం అందించడంతో పాటు క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని కోరారు.

ఇకపోతే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. సోమశేఖర్, అరుణాచలం, రాజేంద్ర మరణించడం చాలా బాధాకరమని, వారి తల్లిదండ్రుల గర్భశోకాన్ని తాను అర్థం చేసుకోగలనని పవన్ అన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టుగా తెలిపారు. 

చిత్తూరు జిల్లా కుప్పంలో పవన్ జన్మదినోత్సవానికి సంబంధించి ఫ్లెక్సి కడుతుండగా విద్యుత్ షాక్‌తో ముగ్గురు అభిమానులు మరణించారు. సుమారు 25 అడుగుల ఎత్తున ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పవన్ బర్త్ డే సందర్భంగా అభిమానులు వేడుకలకు ప్లాన్ చేశారు. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండటంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. 

ఇదే ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై బ్యానర్ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారిని సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలంగా గుర్తించారు.