తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లోకేష్ యువగళరం పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన తల్లి నారా భువనేశ్వరితో పాటు పలువురు నారా, నందమూరి కుటుంబ సభ్యులు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక, పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద లోకేష్ పాదయాత్ర 200వ రోజున 2700 కి.మీ.లకు చేరిన నేపథ్యంలో మైలురాయిని చేరుకుంది. ఈ సంద‌ర్భంగా వైసీపీ స‌ర్కారు వివిధ వర్గాల ప్రజలపై బనాయించిన తప్పుడు కేసులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా ఎత్తేస్తానని హామీ ఇస్తూ పైలాన్ ను ఆవిష్కరించారు. 

ఇదిలాఉంటే, లోకేష్ పాదయాత్ర 200వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. యువత గళం నుంచి ప్రజల గొంతుకగా యువగళం ఎదిగిందని అన్నారు. నారా లోకేశ్‌, యువగళం బృందానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టిన మంచి పనిని కొనసాగించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. 

ఇక, ఈ ఏడాది జనవరి 27న మొదలైన లోకేష్ పాదయాత్ర ఇప్పటివరకు 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,710 కి.మీ. పూర్తిచేసుకుంది. యువగళం పాదయాత్ర 200 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా గురువారం అన్ని నియోజకవర్గాల్లో మూడు కి.మీ. మేర సంఘీభావ పాదయాత్రలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. నవులూరు గ్రామం నుంచి యర్రబాలెం వరకు సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మొదలుపెట్టిన పాదయాత్రలో పెద్ద సంఖ్యలో తెటీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. టీడీపీ మేనిఫేస్టోలో పొందుపరిచిన హామీల ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాదయాత్ర చేశారు.