Asianet News TeluguAsianet News Telugu

రావడం మాత్రం పక్కా-అలసత్వాన్ని సహించను: అధికారులకు చంద్రబాబు వార్నింగ్

తిత్లీ తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 
 

chandrababu naidu warns to officials in srikakulam district
Author
Srikakulam, First Published Oct 12, 2018, 6:08 PM IST

శ్రీకాకుళం: తిత్లీ తుఫాన్ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు తాను ఎప్పుడు ఏ గ్రామానికి వస్తానో ముందుగానే చెప్పనని, అధికారులంతా సహాయక చర్యల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించనని చంద్రబాబు హెచ్చరించారు. దెబ్బతిన్న కొబ్బరి, జీడి, మామిడి, అరటి రైతులను ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. 
అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మళ్లీ సాధారణ స్థితికి చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. బాధితులకు ధైర్యం చెప్పాలని, ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను అధికారులు ఇవ్వాలన్నారు. రెండు మూడు రోజులు పలాసలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు.

మరోవైపు తిత్లీ తుఫాన్ ప్రకోపం వల్ల కలిగిన నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గాల్లో ఏ గ్రామానికి వెళ్తానో ముందుగా చెప్పనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

హుద్‌హుద్‌ ధాటికి తీవ్రంగా నష్టపోయిన విశాఖను యథాస్థితికి తీసుకొచ్చేందుకు ఏవిధంగా చర్యలు చేపట్టామో అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలోనూ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తుపాను ధాటికి ఇల్లు కోల్పోయిన వారికి కొత్తగా ఇల్లు మంజూరు చేస్తామని సీఎం తెలిపారు. 

క్లౌడ్‌ సోర్సింగ్‌ యాప్‌లో తుఫాను నష్టంపై సమాచారాన్ని నమోదు చేయొచ్చని సీఎం వివరించారు. సహాయక చర్యల్లో బాగా కష్టపడిన అధికారులకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. బాధితులను ఆదుకోవడానికి దాతలు కూడా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios