Asianet News TeluguAsianet News Telugu

పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో.. ఇది బిగినింగ్ మాత్రమే.. కుప్పంలో కప్పం కట్టాలా? : చంద్రబాబు

కుప్పంలో నిన్నటి నుంచి ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగువారంతా చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. 

chandrababu naidu slams minister peddireddy ramachandra reddy
Author
First Published Jan 5, 2023, 4:33 PM IST

కుప్పంలో నిన్నటి నుంచి ఏం జరుగుతుందో ప్రపంచంలోని తెలుగువారంతా చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.  ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారై.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను అడ్డుకోలేదని.. పోలీసులు ఆయనకు పూర్తిగా సహకరించారని చెప్పారు. ఆ తర్వాత ఉన్న ప్రభుత్వాలు కూడా షర్మిల పాదయాత్రను అడ్డుకోలేదని తెలిపారు. 

మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాక జగన్ పాదయాత్ర చేశారని, విజయమ్మ, షర్మిలు సభలు పెట్టారని వాటిని తాము అడ్డుకోలేదని చెప్పారు. పోలీసు వ్యవస్థ సహకరించబట్టే జగన్ పాదయాత్రతో రాష్ట్రం మొత్తం తిరిగారని అన్నారు. అదే జగన్ ఇప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి.. తాను రాష్ట్రంలో  ఎక్కడ తిరగకూడదని, సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదని ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం అరాచకం పెరిగిపోతుందని విమర్శించారు. తన ఇంటి మీద దాడి చేసినవారికి మంత్రిపదవులు ఇచ్చారని అన్నారు. 

జగన్‌కు భయం పట్టుకుందని విమర్శించారు. ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ మాదిరి పరిస్థితులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల్లో చాలా మంది మంచివారు ఉన్నారని.. కానీ కొంతమంది మాత్రం వారి స్వార్దం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్లకు కూడా కుటుంబాలు ఉన్నాయని.. తాము రాష్ట్ర బాగు కోసం పోరాటం చేస్తున్నామని  అన్నారు. చట్టాన్ని ఎవరూ అతిక్రమించినా నేరస్తులే అని అన్నారు. పోలీసులే కుట్రపన్ని తమ మీటింగ్‌లు ఫెయిల్ చేయడానికి, బయటకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.  తన పోరాటం పోలీసుల మీద కాదని స్పష్టం చేశారు. 

40 ఏళ్లుగా తాను చైతన్య రథం తిరుగుతున్నానని.. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి అక్రమంగా పోలీసు స్టేషన్‌లో పెట్టారని విమర్శించారు. తమ వాహనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులపై తాము ప్రైవేట్ కేసులు పెడతామని చెప్పారు. జగన్ సీఎంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. పోలీసులు లా అండ్ ఆర్డర్‌ను కాపాడటం లేదని అన్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి చేసిన విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  గుర్తుపెట్టుకో.. ఇది బిగినింగ్ మాత్రమే.. తమాషా ఆటలు ఆడుతున్నావు నువ్వు.. నోరు పారేసుకుంటున్నావు నువ్వు చేసే అరాచకాలకు.. నేను రెచ్చగొట్టానా?. మా మీద  తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఒక సైకో కింద  ఇంకో సైకోగా తయారయ్యావా నువ్వు?. అదే నేను అనుకుని ఉంటే.. 14 ఏళ్లలో నిన్ను వదిలిపెట్టే వాడినా?. ఈ జిల్లాలో తిరిగేవాడివా?. గుర్తుపెట్టుకో.. ఖబర్దార్.. కుప్పంలో కప్పం  కట్టాలని బెదిరిస్తావా?.. వదిలిపెట్టం’’ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయం ముసుగులో ఉన్న నేరస్థులతో పోరాటం చేస్తున్నామని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios