టార్గెట్ మోడీ: కేంద్రంపై చంద్రబాబు మళ్లీ అవిశ్వాసం పోరు

Chandrababu Naidu set to move no-confidence motion against Centre
Highlights

మరోసారి కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మాణం ప్రతిపాదించాలని  బాబు ప్రయత్నాలు ప్రారంభించారు. వివిధ పార్టీల మద్దతును కూడగట్టాలని ఆయన పార్టీ ఎంపీలకు గురువారం నాడు ఆదేశించారు.

అమరావతి:రానున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మరోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హమీలను  అమలు చేయాలనే డిమాండ్‌తో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు.

ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా  ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన టీడీపీ  కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. ప్రత్యేక హోదాతో పాటు ఇతర డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ  టీడీపీ అవిశ్వాసాన్ని అప్పట్లో ప్రతిపాదించింది. ప్రత్యేక హోదా కోరుతూ  వైసీపీ కూడ ఆ సమయంలో అవిశ్వాస నోటీసులు ఇచ్చింది. కానీ,  ఈ నోటీసులపై పార్లమెంట్‌లో, రాజ్యసభ చర్చకు రాలేదు.

ఉభయ సభలు ఆర్డర్‌లో లేని కారణాన్ని సాకుగా చూపి రెండు పార్టీల అవిశ్వాసనోటీసులు చర్చకు రాకుండానే పోయాయి.  ఇదిలా ఉంటే మరోసారి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో  ప్రత్యేక హోదా డిమాండ్‌తో పాటు విభజన హమీ చట్టంలో పొందుపర్చిన హమీలను అమలు చేయాలనే డిమాండ్ తో అవిశ్వాసతీర్మాణాన్ని ప్రతిపాదించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని ప్రతిపాదించేందుకు గాను  టీడీపీ ఇతరపార్టీలను కూడగట్టాలని భావిస్తోంది. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలను ఈ విషయమై కూడగట్టాలని చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీలకు గురువారం నాడు సూచించారని సమాచారం. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే  ఏపీ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకొందని  సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.  దీనికి కౌంటర్ దాఖలు చేయాలని భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మాణం పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చకు వస్తే  బీజేపీ తీరును  ఎండగట్టే అవకాశం దక్కనుందని  ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

గత పార్లమెంట్ సమావేశాల సందర్భంగా  కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాణానికి చాలా పార్టీలు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ దఫా  ఏ పార్టీలు టీడీపీ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తాయో లేదా చూడాలి.

loader