అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన అవినీతి చక్రవర్తి పుస్తకం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్ల పాలన అంతా అవినీతిమయం అని ఆరోపిస్తూ వైసీపీ అవినీతి చక్రవర్తి అనే పుస్తకాన్ని విడుదల చేసింది. 

చంద్రబాబు నాయుడు వివిధ ప్రాజెక్టులలో ఎంత అవినీతికి పాల్పడ్డారో అని తెలియజేస్తూ అందుకు సంబంధించి జీవోలను కూడా పొందుపరిచారు. నాలుగున్నరేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు రూ.6లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని పుస్తకంలో వైసీపీ పేర్కొంది.

అయితే అవినీతి చక్రవర్తి పుస్తకంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అవినీతి చక్రవర్తి వైఎస్ జగన్ అంటూ విమర్శించారు. రాష్ట్రబడ్జెట్ రూ.6లక్షల కోట్లు లేదని అలాంటిది రూ.6లక్షల కోట్లు అవినీతి జరిగిందంటూ జగన్ పుస్తకం వేశాడని విమర్శించారు. 

అవినీతిపరులే అవినీతిపై పుస్తకాలు వేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ రూ.43వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని సీబీఐ స్పష్టం చెయ్యడంతోపాటు చార్జిషీట్ కూడా నమోదు చేసిందని గుర్తు చేశారు. జగన్ వల్ల ఎంతమంది జైలుకు వెళ్లారో అందరికీ తెలుసునన్నారు. 

తన రాజకీయ జీవితంలో అవినీతి అనే దానికి చోటు ఇవ్వలేదన్నారు. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్లో నడుస్తున్నాడని ఆరోపించారు.మోదీ చెప్పినట్లే తనపై పుస్తకం వేయించారని మండిపడ్డారు. రాష్ట్రానికి బీజేపీ తీరని అన్యాయం చేస్తుంటే జగన్ ఎందుకు నోరు మెదడపం లేదని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం రూ.75వేల కోట్లు ఇవ్వాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడ జయప్రకాష్ నారాయణ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. జగన్ పై సీబీఐ కత్తి వేస్తారన్న భయంతో జగన్ మోదీని నిలదియ్యడం లేదని చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు.