కేంద్ర ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరుకు సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల నేతలకు లేఖలు రాశారు. 

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరుకు సహకరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీల నేతలకు లేఖలు రాశారు. పార్టీల అధ్యక్షులకు, పార్లమెంటరీ పార్టీల నేతలకు ఆయన ఆ లేఖలు రాశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ చేస్తున్న పోరాటానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వకుండా, విభజన చట్టం హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆయన విమర్శించారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యను సృష్టించాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కూడా తమ డిమాండ్లను లేవనెత్తినట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్లకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బిజెపి, కాంగ్రెసులపై మేలో జరిగిన ఓ కార్యక్రమంలో తీవ్రమైన విమర్శలు చేశారు. 2019 లోకసభ ఎననికల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్స్ గా అవతరిస్తాయని ఆయన అన్నారు. మోడీ నాయకత్వంలోని బిజెపిని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలు చేతులు కలుపుతాయని ఆయన అన్నారు. 

వచ్చే వర్షాకాలం సమావేశాల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలనే నిర్ణయం తీసుకుంది. తమకు సహకరించాలని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా కోరారు.