Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్ల తర్వాత ప్రధాని మోదీతో చంద్రబాబు.. స్నేహపూర్వకంగా సంభాషణ.. టీడీపీ నేతల్లో ఫుల్ జోష్..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ‌తో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య స్నేహపూర్వక సంభాషణ కూడా చోటుచేసుకుంది. 

Chandrababu Naidu Meets PM Modi after Long Gap
Author
First Published Aug 7, 2022, 10:16 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ‌తో వేదిక పంచుకున్నారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు, మోదీల మధ్య జరిగిన స్నేహపూర్వక సంభాషణ‌పై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2014లో బీజేపీతో జట్టు కట్టిన తెలుగు దేశం పార్టీ.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నుంచి బయటకు వచ్చింది. ఎన్డీయే నుంచి టీడీపీ తెగతెంపులు చేసుకున్న తర్వాత.. చంద్రబాబు, మోదీల మధ్య జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత.. సమావేశంలో పాల్గొన్న ప్రముఖలను వారి వద్దకు వెళ్లి పలకరించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వద్దకు వచ్చిన ఆయనతో కొద్దిసేపు ప్రత్యేకంగా ముచ్చటించారు. వారిద్దరు ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. అయితే ఈ సంభాషణ స్నేహపూర్వకంగా సాగిందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘‘మీరి మధ్య ఢిల్లీ రావడం లేదు.. అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తూ ఉండండి’’ అని చంద్రబాబుతో ప్రధాని మోదీ అన్నారని టీడీపీ వర్గాలను ఉటంకిస్తూ ఈనాడు దినపత్రిక పేర్కొంది. 

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు, మోదీల మధ్య స్నేహపూర్వక సంభాషణ సాగడంతో.. ఏపీలో టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయ సంబంధాలు చిగురించడానికి దారితీస్తుందనే పలువురు టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా బీజేపీతో సత్సబంధాల కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తుందనే రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే తాజా అవకాశాన్ని చంద్రబాబు నాయుడు వదులుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Chandrababu Naidu Meets PM Modi after Long Gap

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పర్యటనలో టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమాలలో పోస్టు చేసింది. అలాగే చంద్రబాబు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ సమావేశంలో పలువురు ప్రముఖులను కలిసిన ఫొటోలను టీడీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే చంద్రబాబు, మోదీలు కలిసి ఉన్న ఫొటో మాత్రం ప్రచారంలోకి రాలేదు. అయితే చంద్రబాబు, మోదీ హాల్‌లో ఒకరితో ఒకరి నిలబడి మాట్లాడుకుంటూ కనిపించే ఒక్క చిన్న వీడియో క్లిప్ మాత్రమే బయటకు వచ్చింది. 

ఆ దిశగా ప్రయత్నాలు ఫలించేనా..?
బీజేపీతో బంధం తెంచుకుని 2019లో జరిగిన సార్వత్రిక, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఆ ఎన్నికల సమయంలో బాలకృష్ణతో పలువురు టీడీపీ నాయకులు.. బీజేపీ, మోదీపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కూడా మోదీకి వ్యతిరేకంగా పలు పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 

ఏపీ వచ్చే ఎన్నికల్లో త్యాగాలకు సిద్దమేనని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌ ద్వారా బీజేపీ, జనసేనలతో రాజకీయంగా పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు సంకేతాలను పంపారని చర్చ సాగింది. మరోవైపు జనసేన అధినేత కూడా పవన్ కల్యాణ్‌ కూడా ఈ విషయంలో కొంత సానుకూలంగానే స్పందించారు. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. తమ పొత్తు జనసేనతో ఉంటుందని స్పష్టం చేస్తూ వస్తున్నారు. 

ఇక, మోదీతో చంద్రబాబుతో ఏం మాట్లాడరనేది తెలియకపోయినప్పటికీ.. ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి గురించి మోదీకి చంద్రబాబు  వివరించినట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏపీ బీజేపీ నాయకులు ఎలాంటి కామెంట్స్ చేసిన చివరకు అధిష్టానం చెప్పినట్టే నడుచుకోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీని చంద్రబాబు కలవడం పట్ల టీడీపీ శ్రేణులు జోష్‌లో ఉన్నారు.  క్రమంలోనే రానున్న రోజుల్లో బీజేపీ, టీడీపీలమధ్య రాజకీయ సంబంధాలు పునరుద్దరణ జరిగితే.. ఇరు పార్టీలకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios