AP New District Formation: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చలు వేడెక్కాయి. ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెంచే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలిస్తోంది, పరిపాలన మెరుగుపరచడమే లక్ష్యం. 

AP New District Formation: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా చంద్రబాబు ప్రభుత్వం ( Chadrababu) అడుగులు వేస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం (Cabinet Sub-Committee) ఏర్పాటు కాగా, ఈ నెల 12వ తేదీ నుంచి సమావేశాలు మొదలు కానున్నాయి. సమావేశాల అనంతరం ఒక నెలలోపు నివేదిక సీఎం చంద్రబాబుకు చేరే అవకాశం ఉంది. డిసెంబర్‌లోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.

26 నుంచి 32 జిల్లాలకు పెంపు

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 26 జిల్లాలను 32కి పెంచే ప్రతిపాదన పై ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తోంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గించి, ప్రజలకు పరిపాలన సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా, కొన్ని పాంత్రాలు ప్రస్తుత జిల్లాల పరిధిలో ఉంటే.. మరికొన్ని మారే అవకాశముంది. అలాగే, నియోజక వర్గాలను కొత్త జిల్లాల్లోకి మార్చే అవకాశం ఉంది.

ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజనపై చర్చ మొదలైంది. అద్దంకి, కందుకూరును మళ్లీ ప్రకాశం జిల్లాలో కలపాలన్న డిమాండ్ ఊపందుకున్నట్లు తెలుస్తోంది. ఇక అమరావతిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలన్న ప్రజల ఆశ కూడా బలంగా వ్యక్తమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఏలూరు జిల్లాలోని నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలను మళ్లీ కృష్ణా జిల్లాలోకి చేర్చాలన్న డిమాండ్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అలాగే.. అన్నమయ్య జిల్లాలో రాజంపేటా లేదా రాయచోటి లో ఏది కేంద్రంగా ఉండాలనే చర్చ కూడా వేడెక్కుతోంది.

ఈ సందర్భంలోనే గతంలో నిలిచిపోయిన ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై.రామవరం మండల విభజన ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే ముందుకు వచ్చినా, అమలు కాలేదు. ఇప్పుడై కూటమి ప్రభుతం ఈ అంశాన్ని మళ్లీ పరిశీలనలోకి తీసుకుంటుందో లేదో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం

కేబినెట్ సబ్ కమిటీ ఈ పునర్వ్యవస్థీకరణ పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో జరగాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలు స్వీకరించి, వాటిని నివేదికలో చేర్చనుంది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల నియోజకవర్గాల స్థానాలు మారే అవకాశం ఉండటంతో, ప్రజల్లో కొంత గందరగోళం తలెత్తవచ్చని నిపుణుల అభిప్రాయం. ఇదిలాఉంటే.. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలోకి వెళుతుందో గుర్తుపెట్టుకోవడం కష్టమే.