Asianet News TeluguAsianet News Telugu

‘‘యూటర్న్ మోడీదే.. 2004లో టీడీపీ గెలుచుంటే ఏపీ మరోలా ఉండేది’’

ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన నమ్మకద్రోహ-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

chandrababu naidu fires on PM Narendramodi

ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన నమ్మకద్రోహ-కుట్ర రాజకీయాలపై ధర్మపోరాట దీక్షలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు తిరుపతి సభలో, నెల్లూరు సభలో, అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పిన ప్రధాని.. ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నారన్నారు.

చేసిందంతా చేసి తాను యూటర్న్ తీసుకున్నానని వాదిస్తున్నారని.. తనది రైట్ టర్న్ అని బీజేపీ అవినీతీలో కూరుకుపోయిందని విమర్శించారు సీఎం. ప్రత్యేకహోదా కోసం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఎవ్వరూ స్థైర్యాన్ని కోల్పోవద్దని ఆత్మహత్య చేసుకుని కుటుంబానికి శోకాన్ని మిగల్చవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు..

ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అందరి బాధ్యత అని చెప్పిన సీఎం.. ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు... తెలుగుదేశం పార్టీ తరపున మరో రూ. 5 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్రహక్కుల కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతున్నారని.. విభజన చట్టం అమలు, ప్రత్యేకహోదాపై ప్రధానిని నిలదీశారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందు చూపుతో ఆలోచించి ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని.. కానీ నేడు బీజేపీ మనకు ఇచ్చిన హామీని విస్మరించిందని అందువల్లే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టాన్ని అమలు చేయని బీజేపీపై అవిశ్వాస తీర్మానం పెట్టామని.. దేశ చరిత్రలో ఒక జాతీయ పార్టీపై అవిశ్వాసం పెట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీయేనని బాబు అన్నారు. ఈ సమయంలో తనకు సహకరించిన పార్టీలన్నింటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి పోరాడాల్సిన ప్రతిపక్షనేత... కేసుల నుంచి బయటపడటానికి బీజేపీతో లాలూచి పడ్డారని.. మోడీని ప్రశ్నించకుండా తనను ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

నాడు అవిశ్వాసం పెట్టండి నేను సహకరిస్తా.. ఢిల్లీకి వచ్చి అన్ని పార్టీల మద్దతును కూడగడతానని చెప్పిన పవన్ అడ్రస్ లేకుండా పోయి.. ఇప్పుడు మన సభలకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి మద్దతు లేకపోయినా.. ప్రతిపక్షాలు ఇబ్బందులు సృష్టిస్తున్నా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నామని.. అదే అందరూ సహకరించి ఉంటే ఎంతో బాగుండేదని స్పష్టం చేశారు.

మాట్లాడితే.. రాజీనామాలు చేయాలని కోరుతున్నారని.. తన దృష్టిలో రాజీనామాలు పెరికి చర్య అని.. వైకాపా ఎంపీలు బీజేపీకి, మోడీకి భయపడి రాజీనామా చేసి ఇంట్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు. నాడు ప్రత్యేకహోదా కావాలని కోరిన సభ్యులంతా ఇప్పుడు పార్లమెంట్‌లో ఉన్నారని.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్  కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని స్పష్టంగా చెప్పారని.. అంతమంది చెబుతున్నా బీజేపీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

టీడీపీ ఎన్టీఏ నుంచి తప్పుకున్నా వైసీపీ ఉందని...బీజేపీ అనుకుంటోదని రాష్ట్రంలో ఆ పార్టీ ఆటలు సాగవని అన్నారు.. రాష్ట్రం కోసం తాను ఎంతో కష్టపడుతుంటే తనకు మెచ్యూరిటీ లేదని ప్రధాని అంటున్నారని.. పరిణితి లేనిది మీకా.. నాకా..? అని మోడీకి సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లా నుంచి కరువును తరిమి కొడతానని.. రాబోయే రోజుల్లో వెలిగొండ, గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.

పదేళ్లకాలంలో నాయకులు రాష్ట్రాన్ని సమస్యల నిలయంగా  తయారుచేశారని.. ఏ పని చేయాలన్నా ఏదో ఒక మెలిక ఉందని.. 2004లో టీడీపీ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చంద్రబాబు వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్లానాలను.. 25 ఎంపీ సీట్లను టీడీపీకి ఇస్తే.. ప్రధానిని మనమే నిర్ణయించి మన హక్కులు సాధించుకుందామని సీఎం స్పష్టం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios