తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యనపాత్రుడు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా.. రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యనపాత్రుడు అరెస్ట్‌పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా.. రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. గోడలు దూకి, తలుపులు పగల గొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయ్యన్న పాత్రుడిని అరెస్టు చెయ్యడం దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో వచ్చిన నాటినుంచి అయ్యన్న కుటుంబాన్నివెంటాడుతోందని ఆరోపించారు. ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు. 

అయ్యనపాత్రుడి కుమారుడు విజయ్‌పై కేసు విషయంలో సీఐడీ విధానాలను కోర్టు తప్పు పట్టినా పోలీసులు మారలేదని చంద్రబాబు నాయుడు విమర్శించారు. దొంగల్లా పోలీసులు ఇళ్లమీద పడి అరెస్టులు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. వైసీపీ సాగిస్తున్న ఉత్తరాంధ్ర దోపిడీపై ప్రశ్నిస్తున్న బీసీ నేతల గళాన్ని అణిచివేసేందుకే అయ్యన్నపాత్రుడిని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ప్రభుత్వ దోపిడీపై అయ్యన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అరెస్టులు అని విమర్శించారు. 

ఇదిలా ఉంటే.. అయ్యనపాత్రుడును, ఆయన కుమారుడు రాజేష్‌లను గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో అయ్యనపాత్రుడు హైకోర్టుకు నకిలీ సర్టిఫికెట్ సమర్పించారని ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అయ్యనపాత్రుడితో సహాయ ఆయన ఇద్దరు కుమారులు విజయ్‌, రాజేష్‌లపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి చేరకున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక, అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని సీఐడీ పోలీసులు ఏలూరు కోర్టులో హాజరుపరచనున్నట్టుగా తెలుస్తోంది.

Scroll to load tweet…


పోలీసులు తీరుపై అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అయ్యన్న పాత్రుడు, రాజేష్‌లను ప్రభుత్వం అరెస్టు చేసిందని అయ్యన్న భార్య పద్మావతి విమర్శించారు. తన భర్త, కుమారుడికి ప్రాణాహాని ఉందని ఆరోపించారు. వారికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక, అయ్యన్న అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నర్సీపట్నం బంద్‌కు పిలుపునిచ్చారు.