అమరావతి: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రపై సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేపట్టిన పాదయాత్రకు, జగన్ చేపట్టిన పాదయాత్రకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. 

జగన్ చేసింది పాదయాత్రలా లేదని విమర్శించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు వైఎస్ జగన్ లా వారానికి రెండు రోజలు హాలిడే తీసుకుని పాదయాత్ర చెయ్యలేదని విమర్శించారు. జగన్ ది పవిత్రమైన పాదయాత్ర కాదని కొట్టి పారేశారు. 

నాదే పవిత్రమైన పాదయాత్ర అంటూ చెప్పుకొచ్చారు. నాలుగున్నరేళ్లలో పెన్షన్లు పది రెట్లు పెంచినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. రైతు భరోసా కింద రుణమాఫీకి ప్రణాళికలు రెడీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మెుండి చెయ్యి చూపారని చంద్రబాబు విమర్శించారు. 

తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టి దోచుకోవాలని వైసీపీ అధినేత జగన్ చూస్తున్నారన్నారు. ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తోందన్నారు. రాష్ట్ర హితం కోసం పనిచేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను కోరారు.