Asianet News TeluguAsianet News Telugu

మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదు: చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో పాల్గొన్న చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

chandrababu naidu comments at jnanabheri sadassu
Author
Vijayawada, First Published Sep 20, 2018, 5:52 PM IST

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన మోదీ ప్రభుత్వంపై ధర్మపోరాటం ఆగదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సులో పాల్గొన్న చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగలేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోసం బీజేపీతో కలవలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీతో కలిసి పనిచేశామని తెలిపారు. అయితే కేంద్రప్రభుత్వం సహకరించకపోవడంతో బయటకు వచ్చేశామని తెలిపారు. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా 2029 నాటికి దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.  

యువత కలలు కనాలని ఆ కలలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జ్ఞానభేరి సదస్సులో పాల్గొన్న చంద్రబాబు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రతీ విద్యార్థి చదువులో ప్రతిభ కనబరచాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల యెుక్క సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని చంద్రబాబు గుర్తు చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అనేక పాఠశాలలను నెలకొల్పామని గుర్తు చేశారు. టెక్నాలజీ అభివృద్ధికి 20 ఏళ్ల క్రితమే బీజం వేశామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి పరచని ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. తెలంగాణకు అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని తెలిపారు. 

ఏపీకి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు తీసుకొచ్చామన్న చంద్రబాబు రెసిడెన్షియల్‌ స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కేంద్రంపై పోరాడి విద్యాసంస్థలను సాధించుకుందామని విద్యార్థులకు స్పష్టం చేశారు.
 
అమరావతి, విశాఖ, తిరుపతిని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ కౌన్సిల్‌ ద్వారా ఇంగ్లీష్‌లో స్కిల్‌డెవలప్‌మెంట్‌ చేపట్టామని అన్ని విద్యాసంస్థల్లో డిజిటల్‌ క్లాస్‌లకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఐఐటీల్లో ఏపీ విద్యార్థులే ఎక్కువగా అడ్మిషన్‌ పొందుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్‌ఐటీలో 18 శాతం ఏపీ విద్యార్థులకు సీట్లు వచ్చాయని, ఐఐటీలో 7 శాతం ఏపీ విద్యార్థులకు సీట్లు వచ్చాయని తెలిపారు.  

మరోవైపు విద్యార్థులు ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కావొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. టాలెంట్ ఉండి విదేశాల్లో చదువుకునేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం ద్వారా 15 లక్షల రూపాయలతో విద్యార్థి చదువుకు సహకరిస్తున్నట్లు తెలిపారు. 

మరోవైపు అక్టోబర్ 2 నుంచి ముఖ్యమంత్రి యువ నేస్తం పథకం ద్వారా చదువుకుని ఉద్యోగం లేని నిరుద్యోగులకు 1000 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుద్యోగ భృతి చెల్లించడం ఒక చరిత్ర అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏ రాష్ట్రం చెయ్యలేని సాహసం తమ ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేశారు. 
 
అలాగే ఇప్పటి వరకు 19వేల ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఇంకా మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు చదువుకుని మంచి ఫలితాలు సాధిస్తే వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.  
 
అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి, తాగునీటిపై దృష్టి సారించిందని చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. రాబోయే రోజుల్లో 2కోట్ల ఎకరాలకు నీళ్లిచ్చి ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios