అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు  తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వకాల్తా పుచ్చుకుందని ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి విఫలమైన తర్వాత ఆ బాధ్యతను టీఆర్ఎస్ తీసుకుందని ఆయన అన్నారు. 

ఎలక్షన్ మిషన్-2019పై మంగళవారం పలువురు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యాన్ ఆంధ్రలో.. స్విచ్ హైదరాబాద్‌లో.. ఫ్యూజులు ఢిల్లీలో.. ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ద్వేషించి తీవ్ర అన్యాయం చేసిన వారితో జగన్ అంటకాగుతున్నారని ఆయన విమర్శించారు. 

ఎర్రచందనం ఆదాయం పోయేసరికి వైసీపీలో నిస్పృహ పెరిగిందని, వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, ఓట్లతోనే వైసీపీ రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. చంద్రగిరిలో రౌడీయిజంపై ప్రజలే తిరగబడ్డారని, ఏపీని మరో బీహార్‌గా చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నాడని చంద్రబాబు అన్నారు. 

వైసీపీ వస్తే గల్లీగల్లీకి రౌడీలు తయారవుతారని అన్నారు. చిత్తూరు, ఒంగోలు, దెందులూరు, కొండవీడు సంఘటనలే అందుకు రుజువు అన్నారు. గతంలో హైదరాబాద్‌లో మతకలహాలు సృష్టించింది వీళ్లేనని, ఇప్పుడు 13 జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీని మించిన నటుడు లేరని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అయితే దేశం 50 ఏళ్లు వెనక్కిపోతుందన్నారు.