వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో విలన్ చంద్రబాబేనా? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ సినిమాని టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. వర్మ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ ప్రచారం నిజమే అని అనిపిస్తోంది.

లెజెండరీ నటుడు, తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’  చిత్రాన్ని వర్మ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేత  ఈ సినిమాకి నిర్మాత అని తెలియగానే రాజకీయంగా రచ్చ మొదలైంది.  వర్మ లాంటి పెద్ద డైరెక్టర్ తో సినిమాని నిర్మించే సీన్ రాకేష్ రెడ్డికి లేదని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. సినిమా నిర్మాణం వెనుక జగన్ హస్తం ఉందని ఇప్పటికే టీడీపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్నారు.

 ఆ ఆరోపణలకు మద్దతుగా శుక్రవారం రాత్రి  వైసీపీ కి చెందిన కీలక నేతలతో వర్మ హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో సమావేశమయ్యారు. ఈ భేటీలో జగన్ బావమరిది బ్రదర్ అనిల్ కమార్, జగన్ పెదనాన్న కొడుకు అనిల్ రెడ్డి, నిర్మాత రాకేష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తమ భేటీ నిజమని వర్మ కూడా ధృవీకరించారు. దీంతో జరగుతున్న పరిణామాలను బట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో చంద్రబాబుని విలన్ గా చూపించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించుకుందా అనే చర్చలు జోరందుకున్నాయి.