అమరావతి: శత్రువు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు కాంగ్రెసుతో చేతులు కలపడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో చంద్రబాబు తెర వెనుక దౌత్యం నెరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. పొత్తుకు ముందే కొంత మందిని నేతలను కాంగ్రెసులో చేర్చుకోవాలని, వారి జాబితాను చంద్రబాబు తన దూత ద్వారా కాంగ్రెసుకు సమర్పించినట్లు తెలుస్తోంది. 

తెలంగాణకు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇటీవల అమరావతి వెళ్లి చంద్రబాబుతో సమావేశమయ్యారని, రెండ్రోజులపాటు అక్కడే ఉన్న ఎమ్మెల్యే రెండుసార్లు చంద్రబాబుతో రహస్యంగా సమావేశమయ్యారని చెబుతున్నారు. రాహుల్‌గాంధీకి సలహాదారుగా ఉన్న ఓ మాజీ బ్యూరోక్రాట్‌కు ఈ ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. 

పొత్తు ప్రతిపాదనపై చంద్రబాబుతో చర్చించేందుకు కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుడొకరిని నియోగించినట్లు చెబుతున్నారు. రాహుల్‌ సలహాదారు సూచనల మేరకు ఏపీ సరిహద్దు జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇటీవల విజయవాడ వెళ్లారని అంటున్నారు. 

గన్‌మెన్, డ్రైవర్‌ లేకుండా తానే సొంతంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లిన ఆ ఎమ్మెల్యే విజయవాడలో రెండ్రోజులు ఉన్నారు. మొదటి రోజు చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఆయన నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆ ఎమ్మెల్యే రాహుల్‌ సలహాదారుకు చేరవేశారని, ఆ ప్రతిపాదనలపై తిరిగి రాహుల్‌గాంధీ సలహాదారు నుంచి వచ్చిన స్పందనను చంద్రబాబుకు రెండోరోజు కలిసి వివరించారని అంటున్నారు.

వచ్చే ఎన్నికలకు పొత్తులో భాగంగా కాంగ్రెస్‌కు లభించే శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికలో తన మాట చెల్లుబాటు కావాలనే వ్యూహంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు సూచనల మేరకే మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కాంగ్రెసులోకి తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

 
టీడీపీ, కాంగ్రెస్‌ పొత్తులో భాగంగా శ్రీకాకుళం లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించాలన్నది చంద్రబాబు వ్యూహమని వార్తలు వచ్చాయి. కాంగ్రెసు నుంచి ఓ పారిశ్రామికవేత్తను పోటీకి దించేందుకు చంద్రబాబు కసరత్తు చేసినట్లు కూడా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరితోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరికొందరిని కాంగ్రెస్‌లో చేర్చి వారికి టిక్కెట్లు దక్కేలా చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. 

తద్వారా, తమ పార్టీలో టికెట్లు దక్కని వారు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరకుండా జాగ్రత్త పడవచ్చుననేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. వారంతా కాంగ్రెసులోకి వెళ్తే జగన్ కు చెక్ పెట్టడానికి వీలవుతుందనేది చంద్రబాబు వ్యూహంలోని ప్రధానాంశమని అంటున్నారు.

రాహుల్‌గాంధీ సలహాదారు ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ పత్రికాధిపతితో సమావేశమైనట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు సంబంధించి ఈ పత్రికాధిపతి అనేక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ పత్రికాధిపతి  టీడీపీ, బీజేపీ మైత్రి కోసం కృషి చేశారు.