నెల్లూరు: ఎస్సీలకు అన్యాయం జరగడానికి వీల్లేదని 40 వేల కోట్ల రూపాయలు నాలుగేళ్లలో ఖర్చు పెట్టామని, కేంద్రం సాయం చేయకున్నా అందుకు వెనుకడుగు వేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 

ప్రతి ఒక్కరికీ పెద్ద దిక్కుగా, పెద్ద కొడుకుగా ఉంటానని హామీ ఇచ్చి క్రమం తప్పకుండా పింఛన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రన్న పెళ్లి కానుకను ఆయన ప్రస్తావించారు. దళితుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. ఏ అభివృద్ధి కార్యక్రమంపై ఎస్సీ కాలనీ నుంచి ప్రారంభం కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. 

శనివారం సాయంత్రం దళిత తేజం ముగింపు సభలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత జ్యోతిప్రజ్వలనం చేసి దళిత తేజం సమావేశాన్ని ప్రారంభించారు. దళితులంతా టీడీపి వైపు ఉన్నారని వేరే పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని ఆయన అన్నారు కేంద్రం సహకరించి ఉంటే ఇంకా బ్రహ్మాండంగా చేసి ఉండేవాడినని ఆయన అన్నారు. 

క్రైస్తవులుగా మారిన దళితులకు కూడా రిజర్వేషన్లు అమలు చేయించడానికి పోరాటం చేస్తామని చంద్రబాబు చెప్పారు. దళితులు పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  దళితులపై దాడులు పెరిగాయని, వాటిని అరికట్టాలని కేంద్రాన్ని గట్టిగా కోరాలని ఆయన అన్నారు. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల పట్ల శీతకన్ను వేశారని చంద్రబాబు అన్నారు. ఇళ్లు కట్టించారా, ఏమైనా చేశారా అని అడిగారు. వైఎస్ తీరుపై వ్యతిరేకతను వ్యక్తం చేయాలని ఆయన అన్నారు. పులివెందుల రింగు రోడ్డు వేయించారని, హుస్సేన్ సాగరులో రోడ్డు వేయించారని, కానీ దళితులకు చేసిందేమీ లేదని అన్నారు. వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చికి రాకుండా బాయ్ కాట్ చేశాడని, దళితుల పట్ల ప్రేమ లేదని, ప్రేమ కేసుల మీద అని, నరేంద్ర మోడీకి దాసోహం చేసే స్థితికి వచ్చారని ఆయన అన్నారు. మీ పేరు చెప్పి ఓట్లు వేయించుకుని ఎన్డీఎకి దాసోహం చేసిన జగన్ కు బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. 

ఇటువంటి కార్యక్రమం వల్ల దళితుల్లో ఐక్యత వస్తుందని, ఆత్మగౌరవం చేకూరుతుందని ఆయన అన్నారు. దళితుల్లో సమర్థులైన నాయకులు ఇంకా రావాలని అన్నారు. అందుకు తాను అండగా ఉంటానని చెప్పారు. 

అంబేడ్కర్ ఆశయాలను నిజం చేయాలంటే మనమంతా ముందుకు సాగాలని ఆయన అన్నారు. జ్యోతిరావు ఫూలే స్ఫూర్తితో తాను ముందుకు పోతున్నట్లు తెలిపారు.  వివిధ వర్గాలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నూటికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, అది దళితుల పట్ల తనకు ఉన్న ప్రేమ అని అన్నారు. 

ఆదరిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఎస్సీ పిల్లలకు ఉందని, అందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. ఆశ్రమ పాఠశాలలను కట్టిన ఘనత ఎన్టీఆర్ ది అని ఆయన అన్నారు. 

నాలుగేళ్లుగా కేంద్రం సహకరించడం లేదని, అన్నీ ఇబ్బందులే ఉన్నాయని, తాను ఎక్కడా రాజీ పడలేదని, పేదలకు న్యాయం చేయడానికి మరిన్ని గంటలు ఎక్కువ పనిచేస్తున్నానని ఆయన అన్నారు. దళితుల్లో అసమానతలను తొలగించే బాధ్యతను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. దళిత మిత్రను తీసుకుని వస్తానని ఆయన చెప్పారు.  రూ. 250 కోట్లు కేటాయించి ప్రతి దళిత కుటుంబానికి ఇంటి స్థలం కేటాయిస్తానని ఆయన చెప్పారు. దళితులకు ఆయన వరాల వర్షం కురిపించారు.