ఏపిలో బ్రాండ్ అంబాసిడర్ల అంశంపై కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే, ఇప్పటి వరకూ నియమితులైన సెలబ్రిటీలందరూ ఏదో ఓ వివాదంలో ఇరుక్కున్న వారే. మొదట్లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ దంపతులను ఎంపిక చేశారు. కొద్ది రోజులకు పనామా పేపర్ల వివాదంలో ఇరుక్కున్నారు. తర్వాత గజల్ శ్రీనివాస్ ను సాంస్కృతిక రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నయమించారు.  తన వద్ద పనిచేసిన ఉద్యోగినులపై సెక్స్ వేధింపుల వ్యవహారంలో ఇరుక్కున్నారు.

తాజాగా పూనమ్ కౌర్ వ్యవహారం కూడా వివాదాస్పదమైంది. చేనేత రంగానికి సినీనటి పూనమ్ కౌర్ ను చంద్రబాబునాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అయితే, సహనటుడు పవన్ కల్యాణ్ తో సంబంధాల వివాదంలో పూనమ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అసలు పూనమ్ ను ప్రభుత్వం చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనే లేదంటూ వివాదానికి ఆజ్యం పోసారు.

ఈ నేపధ్యంలోనే రాష్ట్రానికి అసలు బ్రాండ్ అంబాసిడర్లు అవసరమా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే, రాష్ట్రంలోని ఏ రంగానికి ఎవరిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినా వాళ్ళు ఊడబొడిచేదేమీ ఉండదు. ఏపికి ఓ పరిశ్రమ రావాలన్నా, ఆర్ధిక సంస్ధలు అప్పులు ఇవ్వాలన్నా, కేంద్రం ఏ రకమైన సాయం చేయాలన్నా బ్రాండ్ అంబాసిడర్ల వల్ల ఏమీ కాదు. రాష్ట్రానికి ఏం జరగాలన్నా చంద్రబాబును చూసి రావాల్సిందే,  చంద్రబాబు వల్ల జరగాల్సిందే.

క్షేత్రస్ధాయిలో వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంటే ప్రత్యేకించి బ్రాండ్ అంబాసిడర్ల నియామకమంటూ ప్రభుత్వం ఎందుకు పాకులాడుతోందో అర్ధం కావటం లేదు. నిజానికి ఏపి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమితులు కావటానికి తర్వాత వాళ్ళు వివాదాల్లో ఇరుక్కోవటానికి ఏమీ సంబంధం లేదు.

వారి వ్యక్తిగత వ్యవహారాల వల్ల  బ్రాండ్ అంబాసిడర్లు వివాదాల్లో ఇరుక్కున్నారు.  కాకపోతే  వివాదాల్లో ఇరుక్కున్న సెలబ్రిటీలందరూ ఏపి బ్రాండ్ అంబాసిడర్లు కావటం కేవలం యాధృచ్చికం. అందుకు అందరూ చంద్రబాబును నిందిస్తూ రాష్ట్రం పరువు తీస్తున్నారు. ఒకపుడు జాతీయస్ధాయిలో చక్రం తప్పిన చంద్రబాబుకు ఇంకోరి సాయం అవసరమే లేదు. సరే, ఇపుడంటే ఏదో టైం బావోలేదు కాబట్టి చంద్రబాబే వివాదాల్లో ఇరుక్కుని బయటపడటానికి అవస్తలు పడుతున్నారు. నిజానికి చంద్రబాబుకు మించిన బ్రాండ్ అంబాసిడర్ ఇంకెవరైనా ఉన్నారా?