మరో పథకం పేరు మార్చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎస్ లాంటి కీలక పోస్టుల్లో కొత్తవారిని నియమించిన చంద్రబాబు సర్కార్... మరో కీలక పోస్టులో సీనియర్ అధికారిని నియమించింది. అలాగే, మరో పథకానికి పేరు మార్చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అనూహ్య విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా... ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు.
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా... మంత్రులు ఒక్కొక్కరూ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, హోం మంత్రిగా వంగలపూడి అనిత, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ బుధవారం వారి క్యాంపు కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.
కొత్త డీజీపీగా ద్వారకా తిరుమల రావు..
కొత్త ప్రభుత్వం ఏర్పాటవగానే తన మార్కు పాలనను ప్రారంభించింది. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సాగనంపడం ప్రారంభించింది. ఆయా శాఖల ఉన్నతాధికారులను సైతం మార్చేసింది. ఎన్నికల వేళ డీజీపీని మార్చేసిన ఈసీ.... వైసీపీతో అంటకాగుతున్నారన్న అభియోగాలు ఎదుర్కొన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో హరీశ్ కుమార్ గుప్తాను నియమించింది. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వేళ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంలో విఫలం కావడంతో... గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు గవర్నర్ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లలేకపోయారు. ఈ వ్యవహారంలో డీజీపీ గుప్తాపై గవర్నర్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీని నియమించింది. రాష్ట్రంలోని సీనియర్ ఐపీఎస్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుకు ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సీఎస్, టీటీడీ ఈవో లాంటి కీలక పోస్టుల్లో చంద్రబాబు ప్రభుత్వం కొత్తవారిని నియమించింది.
అలాగే, సంక్షేమ పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొలగిస్తోంది. ఇప్పటికే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్‌గా మర్చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్సార్ విద్యోన్నతి పథకాన్ని ఎన్‌టీఆర్ విద్యోన్నతిగా, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సహాకాలుగా మారుస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఎస్సీల విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చేశారు. సచివాలయాల్లో జగన్ ఫొటోలు తొలగించాలని ఆ శాఖకు ఆదేశాలిచ్చారు. దాంతో పాటు సచివాలయాలు, ఇతర కార్యాలయాలకు వేసిన వైసీపీ రంగులను సైతం తొలగించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే శరవేగంగా మార్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం... మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న వైఎస్సార్ బీమా పథకం పేరు మర్చేసింది. వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా పథకంగా మార్పు చేసింది.
కార్మిక మంత్రి కీలక సంతకం...
ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో, అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించిన మంత్రి సుభాష్.... గత ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న వైఎస్సార్ బీమా పథకానికి పేరు మారుస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ... కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. నవరత్నాల పథకాలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 పథకాల అమలును నిలిపివేశారన్నారు. కార్మిక శాఖకు వచ్చిన రూ.3వేల కోట్ల సెస్సును పూర్తిగా పక్కదారి పట్టించారని ఆరోపించారు. కార్మిక భీమా పథకం కింద గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.2.55 కోట్ల బీమా సొమ్ము చెల్లిస్తే... జగన్ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.1.25 కోట్లను మాత్రమే చెల్లించారని తెలిపారు. ఇక, రాష్ట్రంలోని విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ నగరాల్లో ఉన్న ఇఎస్ఐ ఆసుపత్రులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని... 238 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కూడా పూర్తిగా గత ప్రభుత్వం అశ్రద్ధ వహించిందన్నారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.