జమిలి ఎన్నికలపై జగన్ వైఖరి: చంద్రబాబుకు మైలేజీ

Chandrababu gets mileage with YCP stand
Highlights

జమిలికి అనుకూలంగా తన వైఖరిని వెల్లడించడంతో వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు బలం చేకూరినట్లయింది. దానివల్ల చంద్రబాబుకు మైలేజీ వచ్చినట్లే.

అమరావతి: జమిలి ఎన్నికల విషయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మైలేజీ దక్కినట్లే. వైఎస్ జగన్ బిజెపితో కుమ్మక్కయ్యారని చంద్రబాబుతో సహా టీడీపి నేతలు విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. 

కేసుల నుంచి బయటపడడానికి వైఎస్ జగన్ బిజెపి పంచన చేరారని ఆయన వాదిస్తూ వస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు అది నిర్ధారణ కాలేదు. కానీ, జమిలి ఎన్నికలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరితో బిజెపితో జగన్ స్నేహం చేస్తున్నారనే విషయం నిర్ధారణ అయినట్లు తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. 

దేశంలో జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్ ఎదుట వైసిపి నేతలు మంగళవారం హాజరై తమ వైఖరిని వెల్లడించారు. తాము జమిలి ఎన్నికలకు సానుకూలమేనని చెప్పారు. దీంతో బిజెపికి అనుకూలమైన వైఖరిని వైఎస్సార్ కాంగ్రెసు వెల్లడించినట్లయింది. 

జమిలి ఎన్నికలపై వైసిపి వైఖరితో జగన్ పై మరింత దాడి చేసేందుకు చంద్రబాబుకు అవకాశం దక్కిందని, దానివల్ల ఆయనకు మైలేజీ వచ్చిందని అంటున్నారు. చంద్రబాబు జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నారు. బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ జమిలి ఎన్నికలకు అంగీకరించడం లేదు. బిజెపి అనుకూల పార్టీలు మాత్రమే అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థితిలో జగన్ కూడా బిజెపి అనుకూల నేతగా మారిపోయారనే మాట వినిపిస్తోంది.

loader