అమరావతి: విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపనీతో సీఎం జగన్ లాలూచీ పడ్డారని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని... అయితే నిజానికి వారితో లాలూచీ పడాల్సిన అవసరం తమకు లేదన్నారు వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఎల్జీ పాలిమర్స్ తో లాలూచీ పడింది చంద్రబాబేనని...ఆ కంపనీకి సింహాచలం భూములు కట్టబెట్టింది చంద్రబాబేనని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ కు అనుమతి ఇచ్చింది, విస్తరణ కు అవకాశం కల్పించింది చంద్రబాబేనని అంబటి ఆరోపించారు. 

''బాధితులకు ఇంత త్వరితగతిన పరిహారం అందించిన సంఘటన దేశంలో ఎప్పుడు జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం వెళ్లి బాధితులను పరామర్శించారు. మంత్రులు ఉన్నతాధికారులు వైజాగ్ లో ఉండి పరిస్థితిని సమీక్షించమని సీఎం ఆదేశించారు.  యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని సాధారణ పరిస్థితి తెచ్చారు'' అని ప్రశంసించారు. 

''కనీవినీ ఎరుగని రీతిలో చనిపోయిన వారికి కోటి రూపాయలు పరిహారం సీఎం ప్రకటించారు. కాంపిని పరిహారం గురించి ఆలోచన చేయకుండా ప్రభుత్వం ఖజానా నుంచి పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు రాజకీయం దనార్జనే తప్ప మరేమీ తెలియదు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చొని అనుమతి రాలేదంటున్నారు'' అని ఆరోపించారు. 

''స్టైరాయిన్ ను దక్షిణ కొరియా తీసుకెళ్లమని ఎల్జీ పాలిమర్స్ కంపెనీని సీఎం ఆదేశించారు. జరిగిన సంఘటనపై మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. విచారణ తరువాత ఛార్జ్ చీట్ దాఖలు చేస్తారు. ఆమాత్రం తెలియకుండా అరెస్ట్ చేయలేదని టీడీపీ నేతలు రాద్దాంతం చేస్తున్నారు'' అన్నారు. 

''పుష్కరాల సమయంలో చంద్రబాబు ప్రచార పిచ్చి వలన 30 మంది చనిపోతే ఎంతమందిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గెయిల్ లో ప్రమాదం జరిగితే చంద్రబాబు ఎంతమందిని అరెస్ట్ చేయించారు.. ఎంత పరిహారం ఇచ్చారు. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ప్రాణం విలువ తెలియని వ్యక్తి చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో మంచి మనస్సు కనిపిస్తుంది. చంద్రబాబు కళ్ళల్లో దుర్మార్గం మోసం కనిపిస్తుంది. వైజాగ్ లో 12 మంది చనిపోతే చంద్రబాబు పరామర్శించరా. కేంద్రం నుంచి పర్మిషన్ రాకపోతే ఎందుకు గట్టిగా  అడగలేకపోయారు'' అని అన్నారు. 

''రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోయిన సీఎం 30 కోట్లు కేటాయించారు. అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎల్జీ పాలిమర్స్ మీద సీబీఐ అంటున్న టీడీపీ నేతలు గతంలో సీబీఐ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ సీబీఐ విచారణ అంటున్నారు. సిగ్గుండే సీబీఐ విచారణను టీడీపీ నేతలు అడుగుతున్నారా?'' అని విమర్శించారు. 

.''సీబీఐని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా చంద్రబాబు జీవోలు ఇచ్చారు. అమిత్ షా మోడీని రాష్ట్రానికి రావద్దన్నారు. ఇప్పుడు మోడీ కాళ్ళ పట్టుకోవడానికి చంద్రబాబు చూస్తున్నారు'' అని అంబటి పేర్కొన్నారు.