బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం చాలానే ఇచ్చిందని పేర్కొన్నారు.

కాగా.. అతని కామెంట్స్ ని చంద్రబాబు మధ్యలోనే అడ్డుకున్నారు. కేంద్రం చాలా ఇచ్చిందని చెప్పడానికి సిగ్గుగా లేదా అని విష్ణుకుమార్ రాజుని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని.. ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదన్నారు. రక్తం ఉడికిపోతుందన్నారు. 

‘‘ఎవరికి ఊడిగం చేస్తారు? ఏం చేస్తారయ్యా మీరు? జైల్లో పెడతారా... ఆవేదన ఉండదా మాకు? తమిళులకి ఎన్ని ఇచ్చారు? గుజరాత్‌కి ఎన్ని ఇచ్చారు.? రోషం లేదా? తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వులు పెడతారండి. మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారని.. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారని .. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అడుగుతున్నారని.. సాధారణ మహిళలకు ఉండే పరిజ్ఞానం మీకు లేదా’’ అంటూ విష్ణుకుమార్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.