చేతగాని వాడు ఏపీలో అధికారంలో ఉండాలనేది కేసీఆర్ కోరిక అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశాలు చేయడంతోపాటు.. కేసీఆర్, జగన్ లపై విమర్శల వర్షం కురిపించారు.

తెలంగాణలో తన చేతగాని తనం ఎక్కడ బయటపడుద్దో అనే భయంతో కేసీఆర్ భయపడుతున్నారన్నారు. అందుకే ఏపీలో కూడా చేతగానివాడు అధికారంలో ఉండాలని అనుకుంటున్నాడన్నారు. కేసుల మాఫీ కోసం మోదీతో జగన్ రాజీపడ్డారని.. డబ్బుల కోసం కేసీఆర్ తో జగన్ రాజీపడ్డారని ఆరోరపించారు. రాష్ట్రాన్ని టీఆర్ఎస్ కు జగన్ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. డబ్బున్నవాళ్లకు మాత్రమే జగన్ టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు.

ఐదేళ్ల తర్వాత జగన్ ఏపీలో ఉండటానికి వస్తున్నారని.. జగన్ గృహప్రవేశానికి కేసీఆర్ అతిథిగా వస్తున్నారన్నారు. ఆంధ్రావాళ్లపై కేసీఆర్ దూషణలు.. టీడీపీ నేతలపై జగన్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని.. వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు సూచించారు.

ఫిబ్రవరి 1 నుంచి 10లోగా పెన్షన్లు, డ్వాక్రా రుణాలపంపిణీ జరగాలని చంద్రబాబు నేతలకు ఆదేశించారు. కాపు రిజర్వేషన్లపై వైసీపీ, బీజేపీ వైఖరి ఏమిటని ప్రశ్నించారు. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తే వీళ్లకు బాదేంటన్నారు. రాజకీయ లబ్ది పొందాలనేది వైసీపీ, బీజేపీ ఉమ్మడి అజెండా అని అన్నారు. కాపు రిజర్వేషన్లపై పాదయాత్రలో జగన్ ని నిలదీశారని.. అది తన పరిధిలో లేదని జగన్ తప్పించుకున్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు దృష్టి సారించారు. నిన్న 8 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై  చంద్రబాబు కసరత్తు చేశారు. మొత్తం 15 నియోజకవర్గాలకు గాను పని ఒత్తిడితో 8 నియోజకవర్గాల అభ్యర్థులను పూర్తి చేశారు.  కాంగ్రెస్ ఒంటరి పోరు ప్రకటనపై కార్యకర్తల అభిప్రాయాలను సీఎం తెలుసుకున్నారు.

జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రాలలో అక్కడి పార్టీల అభీష్టం మేరకే ఎన్నికల్లో పోటీలు ఉంటాయన్నారు. బెంగాల్ లో తృణమూల్ తో కాంగ్రెస్ పొత్తులేదని చెప్పారు. అయినా.. కాంగ్రెస్ నేతలు కోల్ కతా ర్యాలీకి వచ్చారని గుర్తు చేశారు. దేశంలో వ్యవస్థలను కాపాడుకోవడమే ఉమ్మడి ఎజాండా అని ఆయన పేర్కొన్నారు.