విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై దాడి కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

 విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఎన్ఐఏ దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హత్యా రాజకీయాలు బట్టబయలవుతాయన్న భయంతోనే ఎన్ఐఏకు సహకరించడం లేదని ఆరోపించారు. 

గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు కేసులను ఎదుర్కొన లేడని స్టేలు తెచ్చుకోవడమేనన్నారు. 

సాక్షాత్తు హై కోర్టు ఎన్ఐఏకు ఆధారాలు ఇవ్వాలని సిట్ ను ఆదేశించినా సహకరించకపోవడం దురదృష్టకరమన్నారు. అందువల్లే తాము ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటున్నామని స్పష్టం చేశారు. 

తాము చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదన్నారు. ఎన్ఐఏ దర్యాప్తుకు ఇకనైనా చంద్రబాబు నాయుడు మరియు పోలీసులు వ్యవస్థ సహకరించాలని లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని బొత్స హెచ్చరించారు.