విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో హుందాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్నికల సమయంలో తాను గాజువాకకు ప్రచారానికి రాలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తమకు ఎవరితోనూ లాలూచీ లేదని స్పష్టం చేశారు. అలా ఉంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకునేవాళ్లమని అన్నారు. 

విశాఖపట్నంలో జరిగిన టీడీపీ సమీక్షా సమావేశంలో ఆయన శుక్రవారం ప్రసంగించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పట్లో కేంద్రంతో విభేదించామని, అలా విభేదించి నష్టపోయామని ఆయన అన్నారు. రాష్ట్రానికి లాభం జరగలేదని, పార్టీకి నష్టం జరిగిందని ఆయన అన్నారు. అది పెట్టుకోకుండా ఉంటే మరో విధంగా ఉండేదని ఆయన అన్నారు.

తాము ప్రజలను నమ్ముకున్నామని, తమ నుంచి ప్రయోజనం పొందినవారు తమకు సహకరించలేదని ఆయన అన్నారు. గాజువాకపై సమీక్ష జరుగుతున్న సమయంలో  ఎన్నికల్లో అక్కడ పర్యటించకపోవడంపై టీడీపీ కార్యకర్తల్లో సందేహం ఉందని మాజీ కార్పోరేటర్ ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ ఒక పార్టీ అధ్యక్షుడి పట్ల హుందాతనం ప్రదర్శించాలనే ఉద్దేశంతోనే తాను పర్యటించలేదని అన్నారు. 

ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీపై ఉంటుందనే ఆలోచనతో చేశామే తప్ప ఎవరితోనూ తమకు లాలూచీ లేదని అన్నారు. గాజువాకలో తాను పర్యటించకపోవడం వల్ల టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు కొంత ఇబ్బంది ఎదురైందని ఆయన అన్ారు. తాను పర్యటించి ఉంటే కొన్ని ఓట్లు పెరిగి ఉండేవని, గాజువాకలో మన అభ్యర్థి శ్రీనివాస రావు బాగా పనిచేశారని, పవన్ కల్యాణ్ గెలిచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు.