అమరావతి: తమ పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న మోసంపై, అన్యాయాలపై అచ్చెన్నాయుడు నిరంతరం పోరాడుతున్నారని, ప్రజలకు వాస్తవలు తెలియజేస్తున్నాయని, ఇది సహించలేని జగన్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి రాత్రి 100 మంది పోలీసులు ఆయన ఇంటిపై పడి అక్రమంగా కిడ్నాప్ చేశారని చంద్రబాబు అన్నారు. 

మందులు వేసుకోవడానికి కూడా అచ్చెన్నాయుడిని అనుమతించలేదని, వారి కుటుంబ సభ్యులు ఫోన్ లో అందుబాటులో లేకుండా పోయారని, తాను ఫోన్ చేసినా అచ్చెన్నాయుడు అందుబాటులో లేరని ఆయన అన్నారు. ఇది జగన్ అరాచకం, ఉన్మాదం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు. పిచ్చి పరాకాష్టకు చేరినట్లుందని ఆయన అన్నారు. ప్రజల్లో జగన్ మోసాలకు, అవినీతికి వ్యతిరేకంగా వస్తున్న అసంతృప్తి నిస్పృహగా మారి ఈ రకమైన ఉన్మాద చర్యలకు ఒడిగడుతున్నారని ఆయన అన్నారు. 

Also Read: ఈఎస్ఐ స్కామ్: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు

అచ్చెన్నాయుడిని ఎక్కడికి తీసుకుని వెళ్లారో తెలియదని, ఎందుకు తీసుకుని వెళ్లారో తెలియదని చంద్రబాబు అన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వలేదని, ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. దానికి సీఎం జగన్, హోం మంత్రి, డీజీపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు శాసనసభ పక్ష ఉప నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి నోటీసులు ఇవ్వకుిండా కిడ్నాప్ చేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కాక మరేమిటని ఆయన అడిగారు. 

బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించారని, బీసీ సభ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని, ముఖ్యమైన నామినేషన్ పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపించారని, సంక్షేమ పథకాల్లో కోత విధించారని ఆయన అన్నారు. వాటన్నింటినీ శాసనసభ వేదికగా, ఇతరత్రా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు తెలియజేసినందు వల్ల దాన్ని సహించలేక జగన్ చట్టవ్యతిరేకంగా కిడ్నా చేశారని అన్నారు. 

ఈ దుర్మార్గానికి, ఉన్మాద చర్యకు, అధికార దుర్వినియోగ చర్యలకు నిరసనగా బడుగు, బలహీన వర్గాల ప్రజలు, మేధావులు, ప్రజలు నిరసనలు తెలియజేసి జోతిరావు ఫూలే, అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి నిరసనలు తెలియజేయాలని ఆయన కోరారు.