అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముంచుతున్న ముఖ్యమంత్రిగా జగన్ జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ట్విట్టర్ వేదికగా ఆయన జగన్ పై విమర్శలు చేస్తూ జాతీయ మీడియా వార్తాకథనాన్ని దానికి జత చేశారు. 

"ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్న వారు, ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారనడానికి ఈ పత్రికాకథనాలే నిదర్శనం. నా మీద కక్షతో నేను నిలబెట్టిన వాటిని కూల్చే పని ఆపి, ఇప్పటికైనా ప్రజలకు ఏం చేయాలో ఆలోచించాలి" అని చంద్రబాబు జగన్ పై వ్యాఖ్యానించారు.

 

అదే సమయంలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావుకు చంద్రబాబు జన్మదినకాంక్షలు తెలిపారు. రామోజీ రావుతో పుష్పగుచ్ఛాన్ని పంచుకుంటున్న చిత్రాన్ని ట్వీట్ కు జత చేశారు.

"పత్రికాధిపతిగా సామాజిక చైతన్యానికి పాటుపడుతూ, తెలుగువాడిగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తూ, వ్యాపారవేత్తగా లక్షలాదిమందికి ఉపాధినిస్తున్న 'పద్మ విభూషణ్' శ్రీ రామోజీ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.