ఇంగ్లీష్ భాషకు తాము వ్యతిరేకం కాదని.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తానంటూ ఇటీవల వైఎస్ జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది తప్పు పట్టారు. మాతృభాషను కించపరుస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా... ఈ విషయంపై తాజాగా చంద్రబాబు స్పందించారు.

తెలుగు మాధ్యమం కొనసాగిస్తూనే ఆంగ్ల బోధన ప్రేవేశపెట్టాలని ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ ని సూచనలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని గుర్తు చేశారు. మాతృ భాష తెలుగును కాపాడాలన్నదే టీడీపీ విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.

‘మన భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు  కావాలి. వృత్తిలో రాణించేందుకు ఆంగ్లం అవసరం. ఆంగ్ల మాధ్యమ బోధనకు టీడీపీ వ్యతిరేకమనే దుష్ప్రచారం చేయడం సరికాదు. అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డులను వైఎస్ఆర్ పేరుగా మార్చాలని చూశారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వైసీపీ తోక ముడిచింది. వైసీపీ నేతల రెండు నాల్కల ధోరణిని ప్రజా క్షేత్రంలో ఎండ గట్టాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.