అమరావతి ఆందోళనలు ఏడాది అవుతున్న సందర్భంగా టీడీపీ నాయకులు, శ్రేణులతో తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌ లో చంద్రబాబు మాట్లాడుతూ... ‘‘రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళనలు ఏడాది సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు 6 రోజులు నిరసన కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలి. రేపు గుంటూరులో మహా పాదయాత్ర, 14న తుళ్లూరులో కిసాన్‌ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర, 17న ఉద్దండరాయనిపాలెంలో బహిరంగ సభను విజయవంతం చేయాలి. ’’ అని పిలుపునిచ్చారు.


‘13 జిల్లాల ప్రజా ప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములను అందజేసిన రైతులు, రైతు కూలీలు, మహిళల త్యాగాలు వృధా కారాదు. రాజధాని శంకుస్థాపన సందర్భంగా 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల ప్రజానీకం ఏ విధంగా సంఫీుభావం చూపారో అదే స్ఫూర్తిని ఇప్పుడు కూడా చూపాలి. ఎన్నో వేధింపులను తట్టుకుని ఏడాదిగా రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు రాజీలేని పోరాటం చేస్తున్నారు.’

‘తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలను తట్టుకుని పట్టువదలకుండా ఏడాదిగా ఆందోళనలను కొనసాగించడం ఒక చరిత్ర. అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించి ఉంటే 13 జిల్లాలకు రూ.2 లక్షల కోట్ల సంపద సమకూరేది. అన్ని జిల్లాల యువతకు ఉపాధి వచ్చేది. ఇప్పుడు అంతా నాశనం చేశారు. పెట్టుబడులను తరిమేశారు. ఉపాధి అవకాశాలను తుంగలో తొక్కారు. విశాఖలో విచ్చవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారు. బెదిరింపులు, వేధింపులు, సెటిల్‌మెంట్లతో భయాందోళలను సృష్టిస్తున్నారు. కరోనా సమయంలో కర్నూలును ఏవిధంగా గాలికి వదిలేశారో అందరూ చూశారు. అన్ని రంగాల్లో వైసిపి ఘోరంగా విఫలం అయ్యింది.’
   
‘‘అమరావతిని ఏ విధంగా ధ్వంసం చేశారో, అభివృద్ధిని నిలిపేశారో ప్రజలకు వివరించాలి. ప్రతి ఒక్కరిలో చైతన్యం పెంచాలి. వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై దృఢ సంకల్పంతో పోరాడాలి. అమరావతి రైతులు, రైతు కూలీల పోరాటానికి రాష్ట్రం అంతా సంఫీుభావంగా నిలబడాలి. జెఏసి పిలుపుమేరకు రేపటినుంచి 6రోజుల ఆందోళనల్లో అందరూ భాగస్వాములు కావాలి’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.