మాజీ హోంమంత్రి, వైసీపీ నేత వసంత నాగేశ్వరరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గ్రామంలో ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారంపై కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శికి వసంత ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఇవాళ అసెంబ్లీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. దీనిలో ఆ అంశం చర్చకు వచ్చింది. దీనిపై సీరియస్‌గా స్పందించిన ముఖ్యమంత్రి.. బెదిరింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

బెదిరింపులు, హత్యలతో ఎవరూ ఏమీ సాధించలేరని.. ఇలాంటి చర్యలను ప్రొత్సహించిన వారిపై తీవ్ర స్థాయిలో చర్యలుంటాయని హెచ్చరించారు. మంత్రి దేవినేనిని హత్య చేస్తాం అనే స్ధాయిలో వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని.. అసెంబ్లీలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించాలని సీఎం సూచించారు.

ఈ నెల 7న గుంటుపల్లిలోని ఫ్లెక్సీల తొలగింపుపై విధుల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శికి వసంత ఫోన్ చేసి తెలుగుదేశం ఏజెంట్‌గా పనిచేస్తున్నావంటూ బెదిరించారని....మంత్రి దేవినేనిని ఏమైనా చేస్తామని.. కడప నుంచి మనుషులను తెప్పిస్తామని.. నాకే కాదు జగన్‌కు మంత్రిపై కక్ష ఉందని.. అతను అసెంబ్లీలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడని... వీడిని(ఉమ)ను శాసనసభలో చూడటం జగన్‌కు ఇష్టం లేదని వసంత వ్యాఖ్యానించినట్లుగా పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆడియో టేప్ ఆధారంగా పోలీసులు వసంత నాగేశ్వరరావుపై కేసు నమోదు చేశారు.