అమరావతి: ఎక్కడ దాక్కున్నావ్, జగన్ అనే నినాదంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. మోడీ ఆదివారంనాడు గుంటూరు జిల్లా బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

మోడీ మాయమాటులు చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. పార్టీ నాయకులతో ఆయన ఆదివారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎపి ప్రజలను ఎగతాళి చేసేందుకే మోడీ రాష్ట్రానికి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసిపి భరోసాతోనే మోడీ బహిరంగ సభ జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ మోడీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. రెండు కుండలు పగులగొట్టి జగన్, మోడీలు అక్కర్లేదంటూ నిరసన వ్యక్తం చేయాలని ఆయన సూచించారు. ఎపికి మోడీ, జగన్ ల దిష్టి పోవాలని ఆయన అన్నారు. 

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ జగన్ కు ఏజెంటులా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోడీకి జగన్ సహకరిస్తున్నారనే విషయాన్ని నేడు చేపట్టే ఆందోళనల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన అన్నారు. వ్యవస్థలను నాశనం చేస్తూ మోడీ వాటి గురించే మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. 

రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలకవద్దని ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు నిర్ణయించారు. అలాగే కృష్ణపట్నం కోస్టల్‌ ఇన్‌స్టలేషన్‌ శంకుస్థాపనతోపాటు, క్రూడాయిల్‌ స్టోరేజ్‌ ఫెసిలిటీ జాతికి అంకితం కార్యక్రమానికి కూడా హాజరుకావద్దని నిర్ణయించారు. 

కాగా, ప్రధానమంత్రి పర్యటన కార్యక్రమ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎంవోపాటు మంత్రులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.