అమరావతి: ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ రేపు ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. చేసిన దుర్మార్గాలను చూడడానికి మోడీ రేపు వస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు 

మోడీ ఎపి పర్యటనలో ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయాలని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ లో మాదిరిగా ఎపిలో అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎపిని అస్థిర పరిచేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 

విభజన గాయాలపై కారం చల్లి మోడీ పైశాచికానందం పొందుతున్నారని విమర్సించారు. మోడీ అడుగులు ఎపినే అపవిత్రం చేశాయని వ్యాఖ్యానించారు. రాఫెల్ బురదలో మోడీ కూరుకుపోయారని ఆయన అన్నారు. రాఫెల్ వ్యవహారంలో పిఎంవో జోక్యం దేశానికే అప్రతిష్ట అని ఆయన అన్నారు. 

రెండేళ్లుగా జగన్మోహన్ రెడ్డి శానససభకు రాలేదని, వైసిపి ఎమ్మెల్యేలు శాసనసభ నాలుగు సెషన్స్ కు హాజరు కాలేదని, వారు ప్రజాసేవకూ రాజకీయాలకూ అనర్హులని ఆయన అన్నారు. రాష్ట్రానికి చేసిన ద్రోహంపై జగన్ మోడీని ఒక్క మాట కూడా అనడం లేదని ఆయన అంటూ బిజెపి, వైసిపి కుమ్మక్కుకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. 

తెలుగుదేశం పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మాటలు చెప్పే నాయకులకు చరిత్రలో స్థానం లేదని, చేతల్లో చూపే నాయకులకే చరిత్రలో స్థానమని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ధర్మపోరాటానికి సిద్ధమయ్యానని, తమని తిట్టడానికే మోదీ వస్తున్నారని ఆయన అన్నారు. 

బీజేపీ, వైసీపీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ టీడీపీ దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో దీక్షలు చేపట్టాలని నేతలను ఆదేశించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పోరాటమని ఆయన అన్నారు.