మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆయన కరోనా తో బాధపడుతుండటంతో ఇంటివద్దే ఐసొలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడిని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. 

అచ్చెన్నకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇకపోతే... ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి  శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 

కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవద్దని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 70 రోజుల పాటు అచ్చెన్నాయుడు రిమాండ్ లో ఉన్నారు. నామినేషన్ పద్దతిలోనే మందుల కొనుగోలుకు అచ్చెన్నాయుడు లేఖ ఇచ్చారని... దీని ద్వారా రూ. 150 కోట్ల మేరకు అవకతవకలు చోటు చేసుకొన్నాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు.

ఈ ఏడాది జూన్ 12 వ తేదీన ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరోగ్య కారణాలతో గుంటూరు జైల్లో ఉన్న అచ్చెన్నాయుడిని పోలీసులు రమేష్ ఆసుపత్రికి తరలించారు. 

మరోవైపు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడికి కరోనా సోకడంతో కోర్టు అనుమతితో ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు.విడుదల అయ్యేవరకు అచ్చెన్నాయుడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోనే చికిత్స పొందారు.