Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అరెస్టు : ఏమిటీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం?

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఆయన అరెస్టు జరిగింది. ఆయనను అదుపులోకి తీసుకునే సమయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Chandrababu Arrest: What Skill Development Scam?..ISR
Author
First Published Sep 9, 2023, 9:01 AM IST

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం  చంద్రబాబు నాయుడిని  పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు. ఈ అరెస్టు సమయంలో ఆ ప్రాంతంలో హైడ్రామా చోటు చేసుకుంది. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. మరి అసలు ఇంత గందరగోళ పరిస్థితుల్లో ఆయన అరెస్టు అయిన కేసు ఏమిటి ? అసలు ఏమిటీ స్కిల్  డెవలప్ మెంట్ కుంభకోణం..? తెలుసుకుందాం.. 

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2015లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,350 కోట్ల ప్రాజెక్టుకు డీల్ కుదుర్చుకుంది. జర్మనీ దేశానికి చెందిన ‘సీమెన్’ అనే సంస్థ ద్వారా యువకులకు పలు నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పది శాతం షేర్ ను చెల్లించాల్సి ఉంది. 

అయితే ఏపీ ప్రభుత్వం షేర్ చెల్లింపుల్లో రూ.240 కోట్లను దారి మళ్లించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పాటు నకిలీ బిల్లులు తయారు చేసి, ఇన్‌వాయిస్‌లు సృష్టించి జీఎస్టీని ఎగవేశారని అభియోగాలు కూడా ఉన్నాయి.  అయితే తాజాగా ఏపీ స్కిల్ కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి ఏపీ సీఐడీకీ ఫిర్యాదు అందించారు. 

కాగా.. గతంలోనే ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. 2021 జూలై నెలలో ఈ ఆరోపణలపై విచారణ జరపాలని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా.. సీఐడీ రిపోర్టును బేస్ చేసుకొని ర్థిక లావాదేవీలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) ఫొకస్ పెట్టింది. 

అయితే ఈ కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ, సీఈవో గంటా సుబ్బారావు, డైరెక్టర్‌ కె.లక్ష్మీ నారాయణ, అలాగే మరో 26 మందిపై సీఐడీ అంతకు ముందు కేసు బుక్ చేసింది. ఇందులో భాగంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణపై విచారణ జరిపారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఓఎస్డీగా పని చేయడమే ఆయనపై ఈ విచారణ జరిపేందుకు కారణం. రిటైర్డ్ అయిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు ఆయన సలహాదారుడిగా సేవలు అందించారు. దీంతో పాటు కొత్తగా ఏర్పడిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు  మొట్ట మొదటి డైరెక్టర్ గా కూడా లక్ష్మీనారాయణ వ్యవహరించారు.

ఇక స్కిల్ డెవల్ మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలైంది. అయితే ఈ ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందనే అభియోగాలపై లక్ష్మీనారాయణ నివాసంలో సీఐడీ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. అనంతరం రిమాండ్ రిపోర్టు దాఖలు చేసింది. 2015 సంవత్సరం జూన్‌ నెలలో ఈ కార్పొరేషన్ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంది. 

గత ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్, అలాగే డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌కు రూ..241 కోట్లు కేటాయించిందని.. ఉద్దేశపూర్వకంగా ఈ సొమ్ము ఇచ్చిందని ఆరోపించింది. అయితే ఈ డబ్బును ఏడు షెల్ సంస్థలకు ఫేక్ ఇన్‌వాయిస్‌లు తయారు చేసి పంపించారని పేర్కొంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 371 కోట్ల రూపాయిల్లో 241 కోట్ల రూపాయిల అవకతవకలు తన రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios