డిజిపి గారు... ప్రజలపై పల్నాడు ఎస్పీ దాష్టికం చూడండి..: వర్ల రామయ్య (వీడియో)
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు పోలీసులు ప్రజల కోసం కాకుండా వైసిపి కోసం పనిచేస్తున్నారని... నిరసన గళాలను అణచివేయడమే పనిగా పెట్టుకున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా టిడిపి శ్రేణులు ఆందోళన బాట పట్టారు. అయితే తమ నాయకుడి కోసం శాంతియుతంగా నిరసన చేపడుతున్నా పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని టిడిపి నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపైనే కాదు సామాన్య ప్రజలపై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటూ రాష్ట్ర డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు జాతీయ మానవ హక్కుల కమీషన్ కు రామయ్య లేఖ రాసారు.
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొందరు పోలీసులు తమ విధులను మరిచి కేవలం అధికార పార్టీ ఏం చెబితే అదే చేస్తున్నారని రామయ్య ఆరోపించారు. ఇలా వైసిపితో చేతులు కలిపిన పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు. నిరసన గళాలను అణచివేసి వైసిపి నాయకుల మెప్పు పొందడానికి కొందరు పోలీసులు ప్రయత్నిస్తున్నారని రామయ్య ఆరోపించారు.
వీడియో
ఇటీవల(సెప్టెంబర్ 9న) స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయించిందని... దీంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరసన తెలిపారని వర్ల రామయ్య అన్నారు. ఇలా పల్నాడు జిల్లాలో నిరసన చేపట్టిన టిడిపి శ్రేణులు, ప్రజలను పోలీసులు అత్యంత దారుణంగా చితకబాదారని అన్నారు. స్వయంగా జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి లాఠీ పట్టుకుని ప్రజలను భయబ్రాంతులకు గురిచేసారని... నిరసనకారులను చితకబాదారన్నారు. అంతేకాదు మిగతా పోలీసులతో కూడా ఎస్పీ నిరసనకారులను విచక్షణారహితంగా దాడి చేయించాడని వర్ల ఆరోపించారు.
Read More కొడాలి నాని, వంగవీటి రాధా, పార్థసారథిలకు అరెస్ట్ వారెంట్ జారీ.. పూర్తి వివరాలు ఇవే..
పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అధికార వైసిపి కోసమే పోలీసులు వున్నట్లు వ్యవహరిస్తున్నాడని రామయ్య అన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టినవారిపై ఎస్పీ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని... రవిశంకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిపి, జాతీయ మానవ హక్కుల కమీషన్ ను కోరుతూ వర్ల రామయ్య లేఖ రాసారు.
అసలేం జరిగిందంటే:
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు నంద్యాలలో వుండగా అరెస్ట్ చేసారు. అక్కడి నుండి విజయవాడకు తరలిస్తుండగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద రోడ్లపైకి వచ్చిన టిడిపి శ్రేణులు చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దీంతో స్వయంగా జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి రంగంలోకి దిగి కాన్వాయ్ ను అడ్డుకున్నవారిని విచక్షణారహితంగా లాఠీతో చితకబాదాడు. ఈ క్రమంలో కొందరు మీడియా ప్రతినిధులపైనా ఎస్పీ దాడిచేసాడు.
ఎస్పీ రవిశంకర్ రెడ్డి నిరసనకారులను లాఠీతో చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎస్పీ తీరుపై ప్రతిపక్ష పార్టీలతో పాటు మీడియా సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వైసిపి నాయకుడిలా మారిపోయిన ఎస్పీ పూనకం వచ్చినట్లు ఊగిపోతూ లాఠీ పట్టుకుని ఓవరాక్షన్ చేసాడని... వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు కోరుతున్నారు.