Asianet News TeluguAsianet News Telugu

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం

నాడు రాష్ట్రపతి పీఠం, రేపు ప్రధాని పీఠం ఇదే బాబు తారకమంత్రం 

Chandra babu master plan
Author
Vijayawada, First Published Nov 1, 2018, 12:23 PM IST

అమరావతి: దేశంలో సరికొత్త రాజకీయ పొత్తులకు తెర లేస్తోంది. రానున్న రోజుల్లో చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రెడీ అయ్యారు. ఇక ఢిల్లీ కేంద్రంగా తన రాజకీయ ప్రస్థానానికి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 

జాతీయ స్థాయి రాజకీయాలు చెయ్యడంలో దిట్ట అయిన చంద్రబాబు నాయుడు మళ్లీ తన సత్తాను చూపించేందుకు ప్రాంతీయపార్టీలు ఏ కమైతే జాతీయ పార్టీల పరిస్థితేంటన్నది నిరూపించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. 

గతంలో చంద్రబాబు యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. కాంగ్రెస్‌యేతర ప్రభత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. ప్రధానంగా ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర పోషించాడు. 

అంతేకాదు చంద్రబాబు రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడం. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ఎంపిక చేసి ఆ స్థానంలో నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించింది చంద్రబాబే అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

2002లో అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కలాం భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేశారు. నేషనల్ డెమోక్రటికక్ ఫ్రంట్ సారధ్యంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నారు. ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు పనిచేస్తున్నారు. 

భారత రాష్ట్రపతిగా హిందుయేతర వ్యక్తిని, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని ప్రధాని వాజ్ పేయి నిర్ణయించారు. అందులో భాగంగా ముగ్గురు మైనారిటీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. 

ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫోన్ చేశారు. జాబితాలోని మూడు పేర్లలో ఒకటిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం పేరుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. శాస్త్రవేత్తగా ఉన్న కలాం రాష్ట్రపతిగా ఒప్పుకుంటారా అన్న వాజ్ పేయి సందేహాన్ని పంటాపంచెలు చేశారు చంద్రబాబు. కలాంను ఒప్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు ఆ బాధ్యత తన భుజాన వేసుకున్నారు.  

ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి ఫోన్ లో మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు చెన్నైలో ఉన్న కలాంకు ఫోన్ చేశారు. 

రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని కేంద్రం ఎంపిక చేసింది అని తెలిపారు. అందుకు అబ్దుల్ కలాం ససేమిరా అనడంతో చంద్రబాబు నో అని చెప్పొద్దంటూ బ్రతిమిలాడారి ఎట్టకేలకు ఒప్పించారట. అలా అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.

అయితే ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆనాడు రాష్ట్రపతిని ఎంపిక చెయ్యడంలో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు నాయుడు ఈసారి ప్రధానిని నిర్ణయించే దిశగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ యేతర ప్రభుత్వానికి ఎలా అయితే ప్రాంతీయ పార్టీలను ఏకం చేశారో ఈనాడు బీజేపీ యేతర ప్రభుత్వానికి మళ్లీ జాతీయ పార్టీలను ఏకం చేసేందుకు రెడీ అయ్యారు. 

ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిసిన చంద్రబాబు నాయుడు మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను కూడా కలిశారు.

 

దేశంలో నెలకొన్న రాజకీయ పరిణమాలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ కు కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయంపై వివరించారు. ప్రస్తుత తరుణంలో ప్రజాస్వామ్యం ప్రమాదకరపరిస్థితుల్లో ఉందని ప్రత్యామ్నాయ మార్గాలు చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తెలిపారు. 

ఆ తర్వాత సమాజ్ వాదీ పార్టీ నేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. బీజేపీ యేతర ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేద్దామని స్నేహ హస్తం అందించారు. బీజేపీని గద్దె దించేందుకు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అందుకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. 

ఇకపోతే జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పడంతోపాటు తెలుగుదేశం పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉండగా తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుంది. జాతీయ పార్టీ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యించాలన్నది చంద్రబాబు వ్యూహం. 

అందులో భాగంగా తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్న తమిళనాడు, కర్ణాటక,ఒడిస్సా, ఢిల్లీ, అండమాన్ నికోబార్ వంటి రాష్ట్రాల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రధానిని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదగాలని భావిస్తున్నారు. అందువల్లే కేంద్రంలో 45 మంది ఎంపీలను గెలిపించుకుని కేంద్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాలని చంద్రబాబు యోచనలో ఉన్నారు. 

ఆనాడు ఎన్డీఏ కన్వీనర్ గా రాష్ట్రపతి ఎంపికలో ఎలాంటి కీ రోల్ ప్లే చేశామో అదేతరహాలో ఈసారి ప్రధాని మంత్రిని ఎంపిక చెయ్యడంలో కూడా అలాంటి పాత్రే పోషించాలని చంద్రబాబు నాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. గతంలో కూడా జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చంద్రబాబు ప్లాన్ ప్రస్తుత రాజకీయాల్లో వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

Follow Us:
Download App:
  • android
  • ios