విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. జనసేన, బిజెపి కలిసి పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. అందుకు తగిన ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నాయి. 

శాసనసభ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన వామపక్షాలతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో వామపక్షాలకు ఒక్క సీటు కూడా రాలేదు. జనసేన మాత్రం ఒక్క శాసనసభ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జనసేన బిజెపితో పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. 

జనసేనకు దూరమైన వామపక్షాలు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కునేందుకు సిద్ధఫడుతున్నాయి. తాము టీడీపీతో, సీపీఎంతో కలిసి పోటీ చేస్తామని సిపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సోమవారంనాడు చెప్పారు. తమ పార్టీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఆదేశాలిచ్చారని, రేపటిలోగా దానిపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

చంద్రబాబుపై బిజెపి తీవ్ర వ్యాఖ్యలు....

ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారని బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారంనాడు ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు అస్త్రసన్యాసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా పేరు చెప్పి ఎన్నికలను వాయిదా వేయాలని చంద్రబాబు కోరడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎన్నికలకు భయపడే చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని ఆయన అన్నారు. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో లేదని, అయినప్పటికీ టీడీపీ కరోనా పేరు చెప్పి ప్రతిపక్షాలను బలహీనపరుస్తోందని ఆయన అన్నారు. 

స్థానాలపై జనసేనతో చర్చిస్తాం....

బిజెపి, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం జరిగిందని బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహా రావు సోమవారం చెప్పారు. బిజెపి బలంగా ఉన్న స్థానాల గురించి చర్చించామని, సరైన అభ్యర్థులను పోటీకి దించుతామని ఆయన చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై జనసేనతో చర్చలు జరుపుతామని ఆనయ అన్నారు. 

ఇరు పార్టీలు సమన్వయంతో అభ్యర్థులను పోటీకి దించుతాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేనతో కలిసి పోటీ చేస్తామని అన్నారు.