Andhra Pradesh Exit Polls 2024 : చాణక్య సర్వేలో టిడిపి కూటమిదే గెలుపు ... ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?
చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఈసారి టిడిపి కూటమి భారీ విజయం సాధిస్తుందని తేేలింది. ఈ కూటమికి వందకు పైగా సీట్లు వస్తాయని తేలింది.
అమరావతి : చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్ లో టిడిపి కూటమి బారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని తేలింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమికి 114-125 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక వైసిపి కేవలం 39 నుండి 49 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే తేల్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. మొత్తం ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరిగితే నాలుగో విడతలో ఏపీ ఎన్నికలు జరిగాయి. మే 13న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం-జనసేన-బిజెపి కూటమి మధ్య ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగింది.
ఈ ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో రికార్డుస్థాయిలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. పల్లెలతో పాటు పట్టణ ఓటర్లు కూడా పోలింగ్ బూత్ కు కదలి రావడంతో అర్థరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో ఏకంగా 81.86 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇలా ఓటేయడానికి ప్రజలు పోటెత్తడం ఎవరికి లాభిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది.
అయితే ఏపీలో పోలింగ్ ముగిసిన నాటినుండి ఫలితాలపై చర్చ మొదలైంది. తమ పార్టీదే గెలుపంటే తమదే గెలుపని అటు వైసిపి, ఇటు టిడిపి కూటమి నాయకులు చెబుతున్నారు. ప్రజలు కూడా ఎవరి పక్షాన నిలిచారో అంతుచిక్కడం లేదు. దీంతో ఇవాళ తుది దశ లోక్ సభ పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. వీటిని తెలుగు ప్రజలే కాదు అభ్యర్థులు, పార్టీ పెద్దలు ఆసక్తిగా గమనిస్తున్నారు.