ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస రావు ఏపీ బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బంద్ కి కాంగ్రెస్, టీడీపీ మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో బంద్ లో భాగంగా విజయవాడలోని  నెహ్రూ బస్టాండ్‌ ఎదుట ఆయన నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా చలసాని మాట్లాడుతూ.. ఈ బంద్ లో సినీ  పరిశ్రమ కూడా పాల్గొనాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమం కోసం అన్ని పార్టీలు కలిసిరావడం హర్షణీయమన్నారు. స్వచ్ఛందంగా అందరూ బంద్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ఉద్యోగులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. మధ్యాహ్నం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని చలసాని శ్రీనివాస్‌రావు వెల్లడించారు.

చలసాని వెంట పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి, చలసాని శ్రీనివాస్‌, సీపీఐ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.