అమరావతి: ఏపీలో ఎన్నికల ఫలితాల టెన్షన్ రోజురోజుకు ఉత్కంఠ రేపుతున్న తరుణంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది. 

ఈనెల 19న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రామచంద్రాపురంలోని నాలుగు పోలింగ్ బూత్ లలో, పాకాల మండలంలోని ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు రీ పోలింగ్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

కమ్మపల్లి బూత్ నెంబర్ 321, పులివర్తిలోని బూత్ నెంబర్ 104, కొత్తకండ్రిగలోని బూత్ నెంబర్ 316, కమ్మపల్లిలోని బూత్ నెంబర్ 318, వెంకట్రామాపురంలోని బూత్ నెంబర్ 313లలో రీ పోలింగ్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మెరాయించడంతోపాటు మరికొన్ని చోట్ల గొడవలు చోటు చేసుకున్న నేపథ్యంలో 10 పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అటు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిలు ఎన్నికల సంఘాన్ని కోరారు. 

ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసీని కలిశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వెయ్యకుండా టీడీపీ నేతలు దాడులు చేశారంటూ ఆరోపించారు. ఇకపోతే బుధవారం ఉదయం ఏపీ మంత్రి కళా వెంకట్రావు అడిషనల్ సిఈవో సుజాత శర్మను కలిశారు. 

చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్ లలో రీ పోలింగ్ నిర్వహించాలని కోరారు. లేనిపక్షంలో తాము పోరాటానికి సన్నద్దమవుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈసీ రీ పోలింగ్ కు ఆదేశాలు జారీ చెయ్యడం చర్చనీయాంశంగా మారింది.