న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వర రావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వర రావును సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోం శాఖ సమర్థించింది. ఆ సస్పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది.

పోలీసు శాఖ ఆధునీకరణ పేరుతో చేపట్టిన పనుల్లో ఏబీ వెంకటేశ్వర రావు అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని కేంద్రం అభిప్రాయపడింది. ఏబీ వెంకటేశ్వర రావుపై చార్జిషీట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏప్రిల్ 7వ తేదీలోగా ఏబీ వెంకటేశ్వర రావుపై చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించింది. ఏరోసాట్, యుఏవీల కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు అభిప్రాయపడింది.

Also Read: నేనేం వాడుకోలేదు: ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందన ఇదీ...

తనపై జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ను ఏబీ వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఆయన సవాల్ చేసారు. రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగానే తనను సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. తన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. 

నిరుడు మే 31వ తేదీ నుంచి తనకు వేతనం కూడా చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై జగన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో తెలిపారు. 

Also Read: నిజమా?: బాబుతో కలిసి కుట్ర, కుమారుడికి ఏబీ వెంకటేశ్వర రావు కాంట్రాక్ట్

వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్ ను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వెంకటేశ్వర రావును సస్పెండ్ చేయడం కక్షపూరితమైన చర్యగా ఆయన అభివర్ణించారు. వెంకటేశ్వర రావుకు తెలుగుదేశం పార్టీ నేతలంతా అండగా నిలిచారు.