పంచాయితీ నిధుల మళ్లింపు: రేపు ఏపీలో విచారణకు రానున్న కేంద్ర బృందం
పంచాయితీ నిధుల దారి మళ్లింపుపై ఈ నెల 26న ఏపీలో తనిఖీలు చేసేందుకు కేంద్ర బృందం రానుంది.
అమరావతి: పంచాయితీ నిధుల దారి మళ్లింపుపై ఈ నెల 26న ఏపీలో తనిఖీలు చేయనుంది కేంద్ర బృందం. ఆర్థిక సంఘం నిధులు మళ్లింపు, దుర్వినియోగంపై కేంద్ర మంత్రికి ఏపీ పంచాయితీరాజ్ ఛాంబర్ ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా కేంద్ర పంచాయితీరాజ్ శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయకుమార్ రేపు రాష్ట్రానికి రానున్నారు.
గ్రామ పంచాయితీలకు వెళ్లి వివరాలను సేకరించి రికార్డులు పరిశీలిస్తారని పంచాయితీ రాజ్ ఛాంబర్ తెలిపింది. గ్రామ పంచాయితీల్లో నిధుల దుర్వినియోగం జరిగిందని తాము చేసిన ఫిర్యాదుతో కేంద్ర బృందం రాష్ట్రానికి వస్తుందని పంచాయితీ రాజ్ చాంచబర్ నేతలు వైవీబీ రాజేంద్రప్రసాద్, వానపల్లి లక్ష్మీ ముత్యాలరావు తెలిపారు.కేంద్ర బృందానికి పంచాయితీరాజ్ ఛాంబర్, పంచాయితీ సర్పంచ్‌ల సంఘం పూర్తి వివరాలను అందించనున్నారు. కేంద్ర బృందం ఏఏ ప్రాంతాల్లో పర్యటించి ఏఏ అంశాలపై వివరాలను సేకరిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు కేంద్ర బృందానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తామని ఇప్పటికే పంచాయితీరాజ్ చాంబర్ ప్రకటించింది.
ఇదిలా ఉంటే పంచాయితీరాజ్ చాంబర్ రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి ఎలాంటి నివేదికను అందిస్తుందో...ఈ నివేదికపై కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుందో చూడాలి. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.